కేసీఆర్ ప్రచారంపై ఈసీ రెండు రోజులు బ్యాన్ చేయడంపై ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. అన్ని పార్టీల నేతల్లోనూ కేసీఆర్ మాటల్ని ఈసీ ఇంత సీరియస్ గా తీసుకుందా అన్న డౌట్ కు వస్తున్నారు. ఎందుకంటే ఆయన మాట్లాడింది ఇప్పుడు కాదు..దాదాపుగా నెల కిందట సిరిసిల్లలో. ఆ సభలో కాంగ్రెస్ పై ఆయన నోటి నుంచి అసువుగా వచ్చే లత్కోరు వంటి పదాల భాష ఉంది. దానిపైనా ఫిర్యాదు చేశారు కాంగ్రెస్ నేతలు. తర్వాత మర్చిపోయారు. కానీ హఠాత్తుగా కేసీఆర్ ప్రచారంపై రెండు రోజుల బ్యాన్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు.
ఈ ఉత్తర్వులు కాంగ్రెస్ నేతల్లోనూ ఆశ్చర్యానికి గురి చేశాయి. ఆయన ప్రచారాన్ని హఠాత్తుగా రెండు రోజులు ఆపాల్సిన అవసరం ఈసీకేమిటని అనుకున్నారు. బీజేపీలోనూ అదే భావన కనిపించింది. ఆయన బస్సు యాత్ర ఆయన చేసుకుంటున్నాడు.. ఇప్పుడు గొంతు నొక్కేశామని పేరు ఒకటా అని కంగారు పడుతున్నారు. కేసీఆర్ ప్రచారం చేయడం కన్నా.. ఈ అంశాన్నే ఎక్కువగా ప్రచారం చేయాలని బీఆర్ఎస్ నేతలు అనుకుంటున్నారు. నిజానికి కేసీఆర్ ఎప్పుడూ మాట్లాడే మాటలే మాట్లాడారు. వెంటనే కొండా సురేఖకు ఇచ్చినట్లుగా హెచ్చరికలో.. చర్యలో తీసుకుని ఉంటే సమస్య ఉండేది కాదు. కానీ అందరూ అలాంటి మాటలు మాట్లాడిన తర్వాత ఆయన ఒక్కరిపై చర్య తీసుకోవడమే వివాదాస్పమవుతోంది.
జాతీయ స్థాయిలో మోదీ ప్రజల మధ్య చిచ్చు పెట్టేలా నేరుగా ముస్లింల ప్రస్తావన తీసుకు వచ్చి ప్రసంగిస్తున్నారు. ప్రతీ చోటా అదే పరిస్థితి. ఆయనతో పాటు రాహుల్ కు కూడా ఈసీ నోటీసులు జారీ చేసింది. కానీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ముఖ్య నేతల్లో ఒక్క కేసీఆర్ పై మాత్రమే రెండురోజు బ్యాన్ వేశారు. అందరిపై చర్యలు ఒకేలా ఉంటే అందరూ పద్దతిగా ఉంటారు.ఇలా కాకుండా సెలక్టివ్ గా ఈసీ నిబంధనలు అమలు చేస్తే.. విమర్శలే వస్తాయి. ఇప్పుడు అదే జరుగుతోంది.