ఈరోజుల్లో ఫోన్ పే, గూగుల్ పే వంటి యాప్స్ తో చెల్లింపులు సులభంగా చేసుకోవచ్చు. డిజిటల్ ఇండియాలో యూపీఐతో పేమెంట్స్ ఓ విప్లవం. ప్రభుత్వరంగ సంస్థల నుండి స్ట్రీట్ వెండర్స్ వరకు అంతా యూపీఐతో చెల్లింపులు చేస్తున్న వారే. తీసుకుంటున్న వారే.
కానీ, తెలంగాణ విద్యుత్ సంస్థల అలసత్వం కారణంగా యూపీఐతో చెల్లింపులు కొంతకాలంగా ఆగిపోయాయి. సరైన సమయంలో సదరు అధికారులు స్పందించకపోవటంతో బిల్లుల చెల్లింపుకు యూపీఐతో అవకాశం లేకుండా పోయింది. దీంతో విద్యుత్ వినియోగదారులు గగ్గోలు పెట్టారు.
ఆటోమెటిక్ గా బిల్ చెల్లింపులకు అవకాశం ఉండటం, ఈజీగా ఆండ్రాయిడ్ మొబైల్ తో చెల్లింపులు చేసుకునే వెసులుబాటు ఉండటంతో అందరూ చాలా మంది యాప్స్ పై ఆధారపడ్డారు. అకస్మాత్తుగా చెల్లింపులు నిలిపివేయటం, విద్యుత్ సంస్థల పేమెంట్ లింక్ దొరక్క చాలా మంది ఇబ్బంది పడ్డారు. గంటల తరబడి క్యూ లైన్ లో విద్యుత్ సంస్థల ఆఫీసుల వద్ద నిలబడాల్సి వచ్చింది.
తీవ్ర వ్యతిరేకత రావటంతో విద్యుత్ అధికారులు భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్ తో ఒప్పందం చేసుకున్నాయి. గతంలో రిజర్వ్ బ్యాంకు ఈ సేవలు నిలిపివేయగా ఇప్పుడు పునరుద్ధరించారు. పోన్ ఫే ఇప్పటికే చెల్లింపులను స్వీకరిస్తోంది. త్వరలోనే గూగుల్ పే తో పాటు ఇతర యాప్స్ నుండి కూడా పేమెంట్స్ స్వీకరిస్తామని విద్యుత్ సంస్థలు ప్రకటించాయి.