ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగుల పీఆర్సీపై కసరత్తు పూర్తి చేసింది. 34 శాతం ఫిట్మెంట్ను సోమవారం ప్రకటించబోతున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఇప్పటికే ప్రారంభమైన తమ ఉద్యమాన్ని పీఆర్సీ ప్రకటించినంత మాత్రాన ఆపేది లేదని ఉద్యోగ సంఘాల నేతలు చెబుతున్నారు. తమ డిమాండ్ ఒక్క ఫిట్మెంట్ మాత్రమే కాదని ఇంకా 70సమస్యలు ఉన్నాయని వాటిని కూడా పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యమంత్రి కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ .. సీపీఎస్ రద్దుపై సీఎం జగన్ స్పష్టమైన హామీ ఇచ్చారని.. దాన్ని రద్దు చేసి తీరాల్సిందేనని అంటున్నారు.
పీఆర్సీ ప్రకటన, సీపీఎస్ రద్దుతో పాటు కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ, పెండింగ్లో ఉన్న 7 డీఏల బకాయిలు వెంటనే విడుదల, ఆదర్శ పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులకు కూడా పీఆర్సీ ప్రకటించడం, ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు, అంగన్వాడీలకు జీతాలు పెంచడం వంటి అనేక డిమాండ్లను ఉద్యోగ సంఘాలు ప్రభుత్వం ముందు పెట్టాయి. కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకూ వెంటనే పీఆర్సీ ప్రకటించాలి. పీఆర్సీతో పాటు నాన్ ఫైనాన్షియల్ డిమాండ్లను వెంటనే పరిష్కరించే విధంగా సీఎం జగన్ చొరవ తీసుకోవాలని కోరుతున్నారు.
కంటి తుడుపుగా పీఆర్సీ ప్రకటించినా ఉద్యమాన్ని విరమించబోమని రెండో దశ ఉద్యమ కార్యాచరణ త్వరలోనే ప్రకటిస్తామని ఉద్యోగ సంఘాలు చెబుతున్నాయి. ఇప్పటివకే ఇచ్చిన పిలుపు మేరకు 13వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని తాలూకాల్లో నిరసన ర్యాలీలు చేపడతామని స్పష్టం చేశారు. ఉద్యోగులంతా ఉద్యమానికి సహకరించాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం ఇప్పటి వరకూ పీఆర్సీని మాత్రమే సీరియస్గా తీసుకుంది. మిగతా డిమాండ్లపై ఎలా స్పందిస్తుందో ఇంకా స్పష్టత రాలేదు.