ఏపీ ప్రభుత్వం ఉద్యోగవర్గంలో ఓ సంచలనాత్మక మార్పు దిశగా వెళ్తున్నట్లుగా కనిపిస్తోంది. ఉద్యోగులంటే.. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు మాత్రమేనని వారి ఉద్యోగాలను మాత్రమే భర్తీ చేయాలని నిర్ణయించుకున్నట్లుగా కనిపిస్తోంది. రిటైరైన క్యాడర్ ఉద్యోగుల పోస్టులను భర్తీ చేయాలని అనుకోవడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం రిటైర్మెంట్ వయసును ఇటీవల రెండేళ్లు పెంచింది. దీంతో కొంత మంది ఉద్యోగుల రిటైర్మెంట్ వాయిదా పడింది. కానీ మరో ఏడాది తర్వాత రిటైర్మెంట్లు భారీగా ఉండనున్నాయి.
గత కొన్నేళ్లుగా సరైన నియామకాలు లేకపోవడం వల్ల భారీగా ఖాళీలు ఏర్పడుతున్నాయి. నాలుగో తరగతి ఉద్యోగుల నుంచి గ్రూప్-1 వరకు ఆశించిన స్థాయిలో నియామకాలు జరగడం లేదు. అడపాదడపా కొన్ని నియామకాలు జరుగుతున్నప్పటికీ.. వాటికన్నా పదవీ విరమణ చేసే వారి సంఖ్య భారీగా ఉంటోంది. ఉద్యోగుల పదవీ విరమణ పరిమితి పెంచడం వల్ల 2022, 2023 సంవత్సరాల్లో పదవీ విరమణ చేసే వారు లేరు. ఆ తరువాత 2024 నుంచి వరుసగా రిటైర్మెంట్ తీసుకునే ఉద్యోగులు పెరగనున్నారు. 2024లో 13,643 మంది పదవీయ విరమణ చేయనుండగా, అక్కడి నుంచి ప్రతియేటా వారి సంఖ్య పెరగనుంది. 2030 వరకు భారీగా పెరుగుతుంది. 2031 నాటికి 1,17,355 మంది పదవీ విరమణ చేయనున్నారు.
రిక్రూట్మెంట్ లేకపోతే.. మొత్తం ప్రభుత్వ ఉద్యోగులు లేకుండా పోతారు. అయితే ప్రభుత్వం కూడా వ్యూహాత్మకంగానే వ్యవహరిస్తోందని చెబుతున్నారు. రిటైరయ్యే వారి పనులను.. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులతో చేయిస్తారని..ఆ పోస్టులు భర్తీ చేస్తారని అంటున్నారు. అదే నిజం అయితే… ఏపీలో క్యాడర్ పోస్టులు అంటూ ఉండవు. మొత్తంగా ఏపీ ప్రభుత్వం ఉద్యోగ వ్యవస్థనూ ప్లాన్డ్ గా నిర్వీర్యం చేస్తోందని సులువుగా అర్థం చేసుకోవచ్చు.