తెలంగాణ బీజేపీకి చెప్పుకోలేనన్ని కష్టాలు వచ్చి పడుతున్నాయి. ఓ వైపు పార్టీలో చేరే వారు లేకపోగా.. కొత్తగా పార్టీ నుంచి ఎవరూ వెళ్లిపోకుండా ప్రయత్నాలు చేయాల్సి వస్తోంది. ఇటీవలి వరకూ చేరికల కమిటీ చైర్మన్ గా ఉన్న ఈటల రాజేందర్ .. ఒక్కర్ని పార్టీలో చేర్చుకునే విషయంలో సక్సెస్ కాలేకపోయారు. తమ పార్టీలో కోవర్టులున్నారని… ఎవరైనా చేరుతామని వస్తే ఆ సమాచారం వెంటనే… బీఆర్ఎస్ కు చేరిపోతోందని వాళ్లు జాగ్రత్తలు తీసుకుంటున్నారని కొన్ని సార్లు వాపోయారు.
ఇప్పుడు ఆయనకు ఎన్నికల కమిటీ చైర్మన్ పదవి వచ్చింది. ఇప్పుడు ఆయన చేరికలపై కాకుండా… పార్టీని ఎవరూ వదిలి పెట్టకుండా చూసుకోవాల్సిన పరిస్థితిలో పడిపోయారు. అందుకే పార్టీ నేతల్ని కలిసి పార్టీ మారవద్దని బతిమాలుతున్నారు. మాజీ మంత్రి చంద్రశేఖర్ ఇంటికి వెళ్లి తొందరపడవద్దని బుజ్జగించి వెళ్లారు. కోమటిరెడ్డిరాజగోపాల్ రెడ్డికి జాతీయ కార్యవర్గంలో సభ్యత్వం ఇప్పించి.. కూల్ చేసే ప్రయత్నం చేశారు. అయితే.. ఇంకా చాలా మంది నేతలు క్యూలో ఉన్నారు. వారిని ఎలా బుజ్జగిస్తారో చూడాల్సి ఉంది.
ముందు ముందు రాజకీయ పరిస్థితులు… క్లిష్టంగా మారే అవకాశం కనిపిస్తోంది. బీజేపీ, బీఆర్ఎస్ ఒకటేనని ప్రజల్లో నమ్మకం బలపడితే.. బీజేపీ నేతల్లో మరింత అలజడిరేగుతుంది. అప్పుడు ఈటల మరింత ఎక్కువగా వలసల నివారణకు బతిమిలాటలు నిర్వహించాల్సి ఉంటుందన్న వాదన వినిపిస్తోంది.