గ్రేటర్ హైదరాబాద్ లో చెరువుల పరిరక్షణే ధ్యేయంగా హైడ్రా అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తోంది. హైడ్రా పనితీరుపై ప్రజల్లో నుంచి హర్షం వ్యక్తం అవుతుండగా..రాజకీయ పార్టీలు మాత్రం విమర్శలు గుప్పిస్తున్నాయి. హైడ్రా పేదలపై ప్రతాపం చూపిస్తోందని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ మొదటి నుంచి విమర్శల దాడి కొనసాగిస్తూనే ఉన్నారు.
అయితే, హైడ్రా భేష్ అంటూ.. ఈ ప్రత్యేక వ్యవస్థను తీసుకొచ్చిన సీఎం రేవంత్ రెడ్డిపై ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రొఫెసర్ నాగేశ్వర్ రావు ప్రశంసల జల్లు కురిపించడంపై ఈటల తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. నాగేశ్వర్ రావు లాంటి సూడో మేధావులు రేవంత్ ను మేధావి, సంస్కర్త అంటూ గొప్పగా ప్రశంసిస్తున్నారన్నారు.
ఎస్ కన్వెషన్ కూల్చివేత ఒక్కటే నాగేశ్వర్ రావుకు తెలుసునేమో..కానీ చాలామంది పేదల ఇళ్ళకు నోటీసులు ఇస్తున్నారని.. వీటిపై మాట్లాడటం లేదని ఈటల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈటల వ్యాఖ్యలతో ఆయన అభిమానులు సోషల్ మీడియాలో నాగేశ్వర్ రావును ట్రోల్ చేయడం ప్రారంభించారు. ఈ క్రమంలోనే సీన్ లోకి ఎంటర్ అయ్యారు హరీష్.
మాజీ ఎమ్మెల్సీ , విశ్లేషకులు నాగేశ్వర్ రావుపై బీజేపీ నాయకులు చేస్తోన్న దాడి ప్రజాస్వామ్యానికి ప్రమాదకరం అని..రాజకీయ విమర్శలు అర్ధవంతంగా ఉండాలని, కానీ భౌతిక దాడులకు దిగుతామని హెచ్చరికలు మానుకోవాలంటూ బీజేపీ వైఖరిని ఖండిస్తూ ట్వీట్ చేశారు. హరీష్ ట్వీట్ నేరుగా ఈటలపై ఎక్కుపెట్టకపోయినా..అది ఈటల వ్యాఖ్యలను ఉద్దేశించే చేసినట్లు తెలుస్తోంది. హరీష్ వ్యాఖ్యలపై ఈటల ఎలా స్పందిస్తారో చూడాలి.