హుజురాబాద్‌లో టీఆర్ఎస్ ఉపఎన్నికల మ్యాజిక్ పని చేయలేదు. ఈటల రాజేందర్ విజయం సాధించారు. టీఆర్ఎస్ సామ, దాన, భేద, దండోపాయాలను ప్రయోగించినప్పటికీ జన బలం ఈటల రాజేందర్ వైపే నిలిచింది. ఆయన 23వేల ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. తొలి రౌండ్లలో హోరాహోరీగా సాగినట్లు అనిపించినా చివరి రౌండ్లకు వచ్చే సరికి ఈటల ఏకపక్షంగా బలప్రదర్శన చేశారు.
టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ స్వగ్రామం, అత్తగారి ఊరితో పాటు కెప్టెన్ లక్ష్మికాంతరావు లాంటి టీఆర్ఎస్ ముఖ్య నేతల గ్రామాలు, చివరికి దళిత బంధు ప్రారంభించిన గ్రామంలోనూ ఈటలకే మెజార్టీ వచ్చింది. 2004 నుంచి ఎన్నికల్లో పోటీ చేస్తూ వస్తున్న ఈటల ఇంత వరకూ ఒక్క సారి కూడా ఓడిపోలేదు. ఏడో సారి విజయం సాధించారు. ఆరు సార్లు టీఆర్ఎస్ టిక్కెట్ పై విజయం సాధిస్తే ఏడో సారి టీఆర్ఎస్కు వ్యతిరేకంగా బీజేపీ టిక్కెట్‌పై విజయం సాధిచారు.
మెజార్టీని కూడా భారీ స్థాయిలోనే ఉంచుకున్నారు. టీఆర్ఎస్ చతురంగ బలాలను ఉపయోగించి ఈటలను ఒంటరిని చేసినా ఆయన ఎక్కడా వెనక్కి తగ్గలేదు. తన శక్తి సామర్థ్యాల మేరకు ప్రయత్నించి సక్సెస్ అయ్యారు. కేసీఆర్‌ను ఢీ కొట్టి రాజకీయాల్లో నిలబడ్డారు.