ఈ టీవీ స్థాపించినప్పుడే వందల పాత సినిమాల్ని గుత్తగా తీసేసుకొన్నారు. ఆణిముత్యాల్లాంటి తెలుగు సినిమాలన్నీ… ఈటీవీ దగ్గరే ఉన్నాయి. ఒక్కో సినిమా… వందేళ్ల లీజ్ రాయించుకొంది… అతి తక్కువ ధరకి. అసలు శాటిలైట్ సినిమాలకు ఇంత మార్కెట్, రేటు ఉంటాయని, వస్తుందని తెలియని నిర్మాతలు ఈటీవీకి అతి తక్కువ ధరని శాటిలైట్ రేట్లు అంటగట్టేశారు. అయితే.. ఆ తరవాత పరిస్థితులు మారాయి. ఒక్కో సినిమా రూ.10 నుంచి రూ.15 కోట్లు పలికే స్థాయికి ఎదిగింది. అప్పటి నుంచీ.. శాటిలైట్ కొనడం మానేసింది ఈటీవీ. పాత సినిమాలు, ఉషాకిరణ్ మూవీస్ తెరకెక్కించిన చిత్రాలు తప్ప.. శాటిలైట్ లైబ్రరీ లేదు. అయితే ఇప్పుడు మళ్లీ శాటిలైట్ హక్కుల కోసం పోటీ పడుతోంది ఈటీవీ. మొన్నే.. నమో వెంటకేశాయ చిత్రాన్ని కొన్న ఈ టీవీ ఇప్పుడు అమీతుమీ నీ సొంతం చేసుకొంది. రూ.2.25 కోట్లకు ఈ సినిమా కొన్నదని టాక్. అంతేకాదు.. రుద్రమదేవి శాటిలైట్ రేట్లు కూడా ఈ టీవీ చేజిక్కించుకొంది. ఈ సినిమాని దాదాపుగా రూ.5 కోట్లకు కొనుకోలు చేసిందట. చిన్న, మధ్య తరగతి చిత్రాలపై ఈటీవీ దృష్టి పెట్టిందని సమాచారం. ఇప్పటి వరకూ మా, జెమిని, టీ టీవీ మాత్రమే సినిమాల్ని కొంటున్నాయి. ఇప్పుడు ఈటీవీ కూడా పోటీకి వస్తోంది.