జీతం తగ్గించేసి.. పెంచామని చెప్పించి నమ్మించగలిగారు. ఉద్యోగ సంఘాల నేతలతో పొడిగించుకున్నారు. సమ్మెకు వెళ్లకుండా చేయగలిగారు. అయితే ఇలాంటి జిమ్మిక్కులు సీపీఎస్ సమస్యను పరిష్కరించడానికి సరిపోవడం లేదు . సీపీఎస్ ఉద్యోగులు దేనికి అదరక.. బెదరక తమ పోరాటం చేస్తూండటంతో ప్రభుత్వానికి దిక్కు తోచని పరిస్థితిని ఏర్పడుతోంది. తాజాగా నేరుగా సీఎం ఇంటి ముట్టడిని ప్రకటించడంతో ప్రభుత్వం హైరానా పడిపోతోంది.
అధికారంలోకి వారంలో సీపీఎస్ రద్దు అని ఒకటి కాదు.. రెండు కాదు నూట ఇరవై సార్లు జగన్ చెప్పారని సీపీఎస్ రద్దు కోసం ఉద్యమిస్తున్న ఉద్యోగ సంఘాల నేతలు చెబుతున్నారు. వారం దాటి మూడేళ్లయింది. ఇప్పటికీ చేసినా సంతోషమే కానీ చేయడం లేదు. తెలియక హామీ ఇచ్చారని సజ్జల ఓ సారి వ్యాఖ్యానించడం వారికి పుండు మీద కారం చల్లినట్లయింది. తిరిగి తిరిగి ఉద్యమాలు చేసి అలిపోవారే వారే.. ఏదో ఒకటి చేయమని వస్తారని సజ్జల అనుకున్నారు. కానీ వారు రోడ్డెక్కుతున్నారు. మరో వైపు ఎన్నికలవేడి పెరుగుతోంది. దీంతో సీపీఎస్ సమస్య ఎన్నికల దగ్గరకు వచ్చే సరికి మెడకు చుట్టుకుంటుదేమోనని ఆందోళన చెందుతున్నారు.
సీపీఎస్‌ను ప్రస్తుత పరిస్థితుల్లో రద్దు చేయడం సాధ్యం కాదు. దాని కోసం చాలా పెద్ద మొత్తం ఖర్చు చేయాల్సి ఉంటుంది. ప్రభుత్వం వద్ద చిల్లిగవ్వ లేని పరిస్థితి . హామీ ఇచ్చారు కాబట్టి మలు చేయాలని ఉద్యోగ సంఘాలంటున్నాయి. ఇప్పటికీ జీతాలు పీఆర్సీ విషయంలో మోసపోయామన్న భావన.. అసంతృప్తిలో ఉద్యోగులు ఉన్నారు. ఇప్పుడు సీపీఎస్ విషయంలో తేడా వస్తే మొత్తం ఉద్యోగ వర్గం.. కుల, మత, ప్రాంతాలతో సంబంధంలేకుండా వ్యతిరేకమయ్యే ప్రమాదం ఉంది. అందుకే వైసీపీ పెద్దలు కూడా ఈ సీపీఎస్ సమస్యను ఎలా పరిష్కరించాలా అని టెన్షన్ పడుతున్నారు.