సర్వేలు, ఎగ్జిట్ పోల్స్ ఎంత కామెడీ అయిపోయాంటే సోషల్ మీడియాలో ఖాతా ఉన్న ప్రతి ఒక్కరూ ఓ సర్వేయరే అయిపోయారు. తాము ఏదో ఫీల్డ్ లోకి వెళ్లి అభిప్రాయసేకణ జరిపి .. విశ్లేషణ చేసి వివరాలు చెబుతున్నట్లుగా ప్రకటిస్తున్నారు. నిజానికి అలా ప్రకటించే వారికి కానీ… వారు చెబుతున్న సంస్థలకు కానీ ఓ పది మంది మ్యాన్ పవర్ కూడా ఉండదు. ఆఫీసులో కూర్చుని తమకు నచ్చిన విధంగా లెక్కలు తయారు చేసి గ్రాఫిక్స్ చేసేసి వదిలేస్తునన్నారు. ఇందులో అన్ని పార్టీలకు చెందిన సానుభూతిపరులు ఉన్నారు.
సర్వే చేయడం అంటే అంత తేలిక కాదు. శాంపిల్స్ సేకరణ దగ్గర నుంచి ప్రతీది జాగ్రత్తగా ఎంచుకోవాలి. అన్ని కులాలు, వర్గాలు వచ్చేలా శాంపిల్స్ తీసుకుని వారి సమాధానాల్ని తీసుకుని శాస్త్రీయంగా ఎనాలసిస్ చేయాలి. ఈ ప్రక్రియలో ఎక్కడ తేడా వచ్చినా ఫలితం తేడాగానే వస్తుంది. ఈ విషయం పక్కన పెడితే.. ఇలాంటి శాంపిల్ తీయడానికి ఒక్కొక్క శాంపిల్ కు సగటున రూ. రెండున్నర వేల వరకూ ఖర్చవుతుందని సర్వే సంస్థల అంచనా. ప్రముఖ సంస్థలుఅయితే ఇంకా ఎక్కువ చార్జ్ చేస్తున్నాయి.
ఇంత ఖర్చు పెట్టుకుని ఎవరూ సర్వేలు చేయరు. చేసేంత సామర్థ్యం .. ఆదాయం ఉండదు. కానీ ప్రస్తుతం సోషల్ మీడియా ఖాతా ఉన్న ప్రతి ఒక్కరూ.. ఆ జన్మ పోల్స్.. ఈ జన్మ పోల్స్.. పీపుల్స్ పోల్స్.. పల్స్ , రైజ్, రెడీ అంటూ రకరకాల పేర్లతో సర్వేలు.. ఎగ్జిట్ పోల్స్ వదిలేస్తున్నారు. వాటితో చర్చలు పెట్టుకుంటున్నారు. ఓ రాజకీయ పార్టీలు ఇలాంటి సర్వేలను ప్రకటించడానికి రెండు వందల యూట్యూబ్ చానళ్లు… కొన్ని వందల సోషల్ మీడియా ఖాతాలతో ఒప్పందాలు చేసుకుంది.
సర్వేలపై ప్రజలు నమ్మకం వదిలేశారు. జాతీయ స్థాయిలో వచ్చే కొన్ని ముఖ్యమైన సంస్థల సర్వేలు, ఎగ్జిట్ పోల్స్ మాత్రమే నమ్ముతున్నారు. అతి సర్వత్రా వర్జయేత్ అన్నట్లుగా సీన్ మారిపోయింది.