సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మినారాయణ వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా ఎన్నికల్లో పోటీ చేస్తానని చెబుతున్నారు. కానీ ఏ పార్టీ నుంచి అన్న దానిపై ఆయనకే స్పష్టత లేదు. తరచూ అదే చెబుతున్నారు. జనసేనకు రాజీనామా చేశారు. మళ్లీ వచ్చి చేరుతానంటే.. ఏమంమటారోనని ఆయన మొహమాటపడుతున్నారు. ఎవరినైనా నేతల్ని తమ పార్టీలోకి ఆహ్వానించే అలవాటు జనసేనకు లేదు. వారు వస్తే సరి. వీవీ లక్ష్మినారాయణ వస్తే జనసేన ఆహ్వానిస్తుంది. కానీ ఇక్కడ పిలుపు – స్వయంగా రావడం అనే అంశాల మధ్య ఊగిసలాట ఉంది. ఆయనే రాజీనామా చేసి వెళ్లిపోయారు కాబట్టి ఆయనే రావాలని జనసేన అనుకుంటోంది.
రాజకీయాల్లోకి వచ్చేందుకే.. ఐపీఎస్ సర్వీస్‌కు వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్న వీవీ లక్ష్మినారాయణ మొదట సొంత పార్టీ పెట్టే దిశగా ప్రయత్నాలు చేశారు. చివరికి ఏదీ సాధ్యం కాకపోవడంతో.. చివరి క్షణాల్లో జనసేన పార్టీలో చేరారు. ఈ సారి ఏ పార్టీలో చేరుతారన్నదానిపై విస్తృతంగా చర్చ జరుగుతోంది. జగన్ అవినీతి కేసుల్ని పూర్తిగా దర్యాప్తు చేసిన అధికారిగా ఆయన ఆ పార్టీలో చేరలేరు. ఇక టీడీపీలో చేరితే.. రాజకీయంగా విమర్శలతో ఎటాక్ చేయడానికి వైఎస్ఆర్సీపీ ఎప్పుడూ రెడీ ఉంటుంది. బీజేపీలో చేరలేరు చేరినా ప్రయోజనం ఉండదు.
అందుకే వీవీ లక్ష్మినారాయణ… కుదిరితే పార్టీ లేకపోతే.. స్వతంత్రం అనే ఆప్షన్ పెట్టుకున్నారు. బలమైన పార్టీలు ఆయనను పిలిస్తే పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని ఆయన మాటలను బట్టి అర్థం చేసుకోవచ్చు. అయినా ఎందుకో రాజకీయ పార్టీలు ఆయనను ఆహ్వానించడానికి పెద్దగా ఆసక్తి చూపించడం లేదు.