తాను దర్యాప్తు చేసిన కేసులను.. ఎన్నికల అస్త్రాలుగా మార్చుకోబోనని… సీబీఐ మాజీ జేడీ, జనసేన నేత వీవీ లక్ష్మీనారాయణ స్పష్టం చేశారు. వృత్తి పరంగా దర్యాప్తు చేసిన కేసులు కోర్టుల్లో ఉన్నాయని వాటిని ఎన్నికల అస్త్రాలుగా ఉపయోగించుకోనని విశాఖలో స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు కొద్ది రోజులుగా.. జగన్ బండారం బయట పెట్టాలని వీవీ లక్ష్మీనారాయణకు పిలుపునిస్తున్నారు. రాష్ట్రానికి జగన్ ఎంత అన్యాయం చేశారో.. ఎంత దోపిడీ చేశారో వివరిస్తే.. వీవీ లక్ష్మీనారాయణ.. ఏపీకి అంత కంటే చేసే మేలు ఏమీ ఉండదని చెబుతున్నారు. దాదాపుగా ప్రతి ఎన్నికల ప్రచార సభలోనూ.. చంద్రబాబు.. జగన్ కేసులపై మాట్లాడాలని విజ్ఞప్తి చేస్తూండటంతో.. వీవీ లక్ష్మీనారాయణ ఇలా స్పందించినట్లు భావిస్తున్నారు.
నిజానికి వీవీ లక్ష్మీనారాయణ… దర్యాప్తులో ఉన్నప్పుడు తప్ప.. ఆ తర్వాత ఏ సందర్భంలోనూ.. మీడియాతో జగన్ కేసుల గురించి మాట్లాడలేదు. కోర్టులో ఉన్న కేసులు.. దర్యాప్తు చేసిన అధికారులు మాట్లాడటం అరుదు. పైగా ఇలాంటి విషయాల్లో… లక్ష్మీనారాయణ చాలా సిన్సియర్ గా ఉంటారు. ప్రస్తుతం కోర్టుల్లో ఉంది కాబ్టటి.. ఆయన కేసుల గురించి మాట్లాడటం లేదని అంచనా వేస్తున్నారు. తీర్పు వచ్చిన తరవాత మాత్రం మాట్లాడే అవకాశం ఉందని చెబుతున్నారు. విశాఖలో ఎన్నికల ప్రచారం లో లక్ష్మీనారాయణ తీరిక లేకుండా గడుపుతున్నారు. పవన్‌కు తనకు.. స్పష్టమైన ఎజెండా ఉందన్నారు.
పవన్, తాను కలిశాం…మంచి ఆశయాలతో పనిచేస్తామంటున్నారు. రైట్ మేన్ ఇన్ ది రైట్ పార్టీ అని జస్టిఫై చేసుకుంటున్నారు. ఐపీఎస్ ఉద్యోగాన్ని వదిలిపెట్టా…ఐపీసీ, సీఆర్పీసీని వదిలిపెట్టలేదనన్నారు. అవినీతి అనకొండల్ని ఎక్కడికి పంపాలో అక్కడికి పంపిస్తామని హెచ్చరించారు. ఏ విధంగా చూసినా.. జగన్ అవినీతిపై మాట్లాడాలని చంద్రబాబు చేస్తున్న విజ్ఞప్తిని వీవీ లక్ష్మీనారాయణ సున్నితంగా తోసిపుచ్చారనే అనుకోవాలి.