హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబునాయుడు ప్రభుత్వం త్వరలో పడిపోనుందని తిరుపతి మాజీ ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు చింతా మోహన్ జోస్యం చెప్పారు. ఇవాళ తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళే కాదు, గత కొన్నిరోజులుగా చింతా మోహన్ ఇదే విషయాన్ని పదేపదే చెబుతున్నారు. మరి ఈయన లెక్కలు ఏమిటో తెలియటంలేదు…ఆయనా వివరించి చెప్పటంలేదు. రాష్ట్రంలో మధ్యంతర ఎన్నికలు రావటం ఖాయమనికూడా చెబుతున్నారు. ఈయనేమైనా చిన్నా, చితకా నాయకుడైతే ఆ మాటలను కొట్టిపారేయొచ్చు. ఆరుసార్లు తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించిన వ్యక్తి. ఇంత సీనియర్ పార్లమెంటేరియన్లు ఏపీలో అతి కొద్దిమందే ఉంటారు. మరి అలాంటి నాయకుడు ఈ వ్యాఖ్యలు చేయటం విచిత్రంగా ఉంది. నెల్లూరులోని దుగ్గరాజపట్నం ఓడరేవు సాధనకోసం పోరాటం చేస్తాననికూడా ఇవాళ చింతా చెప్పారు. దీనికోసం సోమవారంనుంచి తాను పాదయాత్ర చేపడుతున్నట్లు తెలిపారు. వృత్తిరీత్యా వైద్యుడయిన చింతా మోహన్ ప్రజలతో పెద్దగా సంబంధాలు నెరపకపోయినా, ప్రతిసారీ కాంగ్రెస్ పార్టీ ఊపువలనో, స్థానిక పరిస్థితులవలనో అదృష్టంకారణంగామాత్రమే గెలుస్తుంటారని స్థానికులు చెబుతుంటారు.