సార్వత్రిక ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయోననే ఉత్కంఠకు మరికొద్ది గంటల్లో బ్రేక్ పడనుంది. జూన్ 4న ఎన్నికల ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో ఈ ఫలితాలను ప్రతిబింబించే ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు శనివారం సాయంత్రం విడుదల కానున్నాయి. దీంతో ఈ రిజల్ట్స్ ఎలా ఉంటాయోనని దేశమంతా ఆసక్తిగా ఎదురుచూస్తోంది.
జాతీయస్థాయిలో ఈసారి ఎన్డీయే కూటమి 250 సీట్ల లోపే పరిమితం అవుతానందని పలువురు సెఫాలజిస్టులు వెల్లడించారు.ఇండియా కూటమి అంచనాలను తలకిందులు చేసి అధికారంలోకి రాబోతుందని కొంతమంది విశ్లేషించారు. ఈ నేపథ్యంలోనే ఈ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
ఇక, ఏపీలో పోలింగ్ జరిగిన తీరు పరిశీలిస్తే ఫలితం వన్ సైడ్ ఉండే అవకాశం లేదు. సంక్షేమ పథకాలు వైసీపీని గట్టెక్కిస్తాయని ఆ పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తుండగా… ప్రజా వ్యతిరేకతతో తమ విజయం ఖాయమని కూటమి కూడా అంతకుమించిన ధీమాతో కనిపిస్తోంది. పెరిగిన పోలింగ్ శాతం తమ విజయానికి సంకేతమని అభివర్ణిస్తున్నారు. దీంతో గతంలో ఎప్పుడూ లేని విధంగా ఫలితాలపై నిర్దిష్టమైన అంచనా వేయలేని పరిస్థితి నెలకొంది.
ఈ నేపథ్యంలో ఎగ్జిట్ పోల్స్ ఫలితాలపై కూడా రాజకీయ పార్టీల ప్రభావం ఉండొచ్చునని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. అటు వైసీపీ ఎగ్జిట్ పోల్స్ సంస్థలతో సంప్రదింపులు జరిపి తమకు అనుకూలంగా ఫలితాలు ఇవ్వాలని బేరం నడిపినట్లు ప్రచారం జరిగిన నేపథ్యంలో ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఎలా ఉండనున్నాయి అనే ఉత్కంఠ నెలకొంది.
తమ క్రెడిబులిటీన్నీ పక్కనపెట్టేసి వాస్తవ పరిస్థితులకు విరుద్దంగా ప్రఖ్యాతిగాంచిన ఎగ్జిట్ పోల్స్ సంస్థలు ఫలితాలను ప్రకటిస్తాయా అంటే కష్టమే. మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ ఫలితాల ఆధారంగా అధికార పీఠం ఎవరు కైవసం చేసుకోనున్నారో అనే విషయంలో మొత్తానికి ఓ క్లారిటీ అయితే రానుంది.