‘అర్జున్ రెడ్డి’ చూసి అంతా ముక్కున వేలేసుకొన్నారు. అంత బోల్డ్ సినిమా ఇది వరకెప్పుడూ చూడకపోవడంతో అర్జున్ రెడ్డి కొత్తగా అనిపించింది. ఆ సినిమాకి కుర్రాళ్లు ‘కల్ట్’ చేసేశారు. ఇప్పుడు.. ‘యానిమల్’ వంతు వచ్చింది. రివ్యూలు అటూ, ఇటుగా వచ్చినా బాక్సాఫీసు దగ్గర ‘యానిమల్’ తన ప్రతాపం చూపిస్తోంది. హిందీ బెల్ట్ లో అయితే యానిమల్కి అనూహ్య స్పందన వస్తోంది. ఈ సినిమా అక్కడి రికార్డులు బద్దలు కొట్టడం ఖాయం. అయితే.. ఈ సినిమాలో హింస, బోల్డ్ నెస్ చాలా ఎక్కువైపోయాయన్నది యునానిమస్‌గా వస్తున్న అభిప్రాయం.
నిజానికి ‘అర్జున్ రెడ్డి’ తరవాత ‘షుగర్ ఫ్యాక్టరీ’ అనే సినిమా తీద్దామనుకొన్నాడు సందీప్ రెడ్డి వంగా. వేశ్యావృత్తి, స్మగ్లింగ్, డ్రగ్స్ నేపథ్యంలో సాగే కథ ఇది. అందులో ‘రా’నెస్, హింస, రక్తపాతం, బోల్డ్ సీన్లు ఎక్కువగా ఉన్నాయని.. దాన్ని పక్కన పెట్టి `యానిమల్` తీశాడట. యానిమల్నే ఇలా ఉంటే.. ఇక ‘షుగర్ ఫ్యాక్టరీ’ ఎలా ఉంటుందో ఊహించుకోవొచ్చు. పైగా.. ఇప్పుడు ఈ కథని వెబ్ సిరీస్ గా మలిచే ఆలోచనలో ఉన్నాడు సందీప్ రెడ్డి వంగా. వెబ్ సిరీస్‌లో అయితే.. సెన్సార్ అభ్యంతరాలు ఉండవు. ఎలాంటి సీన్ అయినా రాసుకోవొచ్చు. చూపించొచ్చు. అక్కడ సందీప్ రెడ్డి స్వేచ్ఛకు హద్దులు లేనట్టే. వెండి తెరపై, ఇన్ని సెన్సార్ అడ్డంకుల మధ్య ‘యానిమల్’ని ఈ రేంజ్లో చూపించాడంటే.. ఇక ‘షుగర్ ఫ్యాక్టరీ’లో సందీప్ రెడ్డి వంగా విశ్వరూపం దర్శనమివ్వడం ఖాయం.