లోక్‌సభ స్పీకర్ ఓం ప్రకాష్ బిర్లా కూతురు అసలు యూపీఎస్సీ పరీక్ష రాయకుండానే ఐఏఎస్ అయిపోయారని కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. అంజలి బిర్లా ఐఏఎస్ అంటూ.. ఆమెపై ప్రచారం ప్రారంభించేశారు. నిజం అనిపించేలా చాలా మంది ప్రముఖులు కూడా సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. నిజానికి లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా కుమార్తె ఐఏఎస్ కాదు. కేవలం రైల్వే అకౌంట్స్ సర్వీస్ అంటే ఐఆర్టీఎస్ ఉద్యోగిని మాత్రమే.
ఓం బిర్లా కుమార్తె అంజలి బిర్లా సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ ను 2019లో రాశారు. ప్రిలిమినరీ , మెయిన్స్ పరీక్షలకు హాజరయ్యి ఉత్తీర్ణత సాధించారు. CSE -2019 పరీక్ష తుది ఫలితాల మొదటి జాబితా వచ్చిన ఐదు నెలల తర్వాత UPSC విడుదల చేసిన కన్సాలిడేటెడ్ రిజర్వ్ జాబితాలో ఆమె ఎంపికైంది. అంజలి బిర్లా CSE-2019 పరీక్షకు సంబంధించిన తన అడ్మిట్ కార్డ్, డిటైల్డ్ అప్లికేషన్ ఫారమ్ ని అనేక వార్తా సంస్థలకు షేర్ చేసింది.
2019 సివిల్ సర్వీసెస్ పరీక్షలో, ప్రభుత్వం ప్రకటించిన ఖాళీల సంఖ్య 927, అయితే మొదటి జాబితాలో UPSC ఎంపిక చేసిన అభ్యర్థుల సంఖ్య 829. తరువాత, వివిధ సివిల్ సర్వీసెస్ కోసం 89 రిజర్వ్ జాబితా అభ్యర్థులను కమిషన్ సిఫార్సు చేసింది. 2019 సివిల్ సర్వీసెస్ పరీక్ష ఆధారంగా రూపొందించిన రిజర్వ్ జాబితా నుండి వివిధ సివిల్ సర్వీసెస్ కోసం అంజలితో సహా 89 మంది అభ్యర్థులను జనవరి 2021లో కమిషన్ సిఫార్సు చేసింది. అందులో చోటు దక్కించుకుని అంజలి బిర్లా రైల్వే అకౌంట్స్ సర్వీస్‌కు ఎంపికయ్యారు.
నిజాలు తెలుసుకోకుండా అసలు ఏ పరీక్ష రాయకుండానే ఆమె ఐఏఎస్ అయిపోయారంటూ ప్రచారం చేసేస్తున్నారు.