‘ఇంద్ర’ సినిమా ఈరోజు రీ రిలీజ్ అయ్యింది. చిరంజీవి పుట్టిన రోజు కదా? థియేటర్ల దగ్గర మెగా ఫ్యాన్స్ ‘ఇంద్ర’తో సంబరాలు చేసుకొంటున్నారు. అయితే హైదరాబాద్ ఇంద్ర సినిమా ప్రదర్శిస్తున్న ఓ థియేటర్లో ‘అడుగో బన్నీ.. అడుగో బన్నీ’ అంటూ ఫ్యాన్స్ బన్నీ పేరు పలవరించడం కనిపించింది. ‘ఇంద్ర’లో బన్నీ లేడు. అయినా అల్లు అర్జున్ పేరు ఎందుకు వినిపిస్తోంది. అదే కదా డౌటు. ఆ వివరాల్లోకి వెళ్దాం.
Also Read : బన్నీ గడ్డం@ రూ.40 లక్షలు
‘ఇంద్ర’ సినిమాలో శివాజీ ఓ కీలక పాత్ర పోషించాడు. చిరంజీవి మేనల్లుడుగా నటించాడు. అప్పటి వరకూ చిరు నమ్మిన బంటుగా ఉంటూ, చివర్లో వెన్నుపోటు పొడుస్తాడు శివాజీ. అల్లు అర్జున్ కూడా చిరంజీవి మేనల్లుడే. హీరోగా క్రేజ్ వచ్చేంత వరకూ ‘మెగా ఫ్యాన్స్’ అంటూ జపం చేసి, ఆ తరవాత సెపరేట్ గా ‘ఆర్మీ’నే స్థాపించుకొన్నాడు. మెగా కుటుంబంలోని పవన్ కల్యాణ్ కి దాదాపుగా వెన్నుపోటు పొడిచాడు. నంధ్యాల వెళ్లి, వైకాపాకి ప్రచారం చేసి వచ్చాడు. అఫ్కోర్స్.. ఆయన ఓడిపోయాడనుకోండి. అది వేరే విషయం. దాన్ని మెగా ఫ్యాన్స్ సీరియస్గా తీసుకొన్నారు. సొంత కుంటుంబంలోనే కుంపటి పెట్టేశాడేంటి? అంటూ మాట్లాడుకొన్నారు. ఆ గాయం మెల్లగా మానుతోంది అనగా, మళ్లీ ‘మారుతి నగర్ సుబ్రహ్మణ్యం’ ప్రీ రిలీజ్ ఫంక్షన్లో నోరు జారాడు. ‘ఇష్టమైతేనే వెళ్తా. నచ్చితేనే వస్తా’ అంటూ సినిమా డైలాగులు చెప్పాడు. దాంతో మెగా ఫ్యాన్స్ కి మళ్లీ కాలింది. అందుకే ‘ఇంద్ర’లో వెన్నుపోటు మేనల్లుడు శివాజీ వచ్చినప్పుడల్లా ఫ్యాన్స్ ‘బన్నీ బన్నీ’ అంటూ కేకలు వేశారు. సినిమా మొత్తం అయిపోయిన తరవాత, బయటకు వచ్చాక కూడా మెగా ఫ్యాన్స్ బన్నీ చేసిన కామెంట్ల కోసమే మాట్లాడుకోవడం కనిపించింది. చూస్తుంటే బన్నీకి ఇది పెద్ద డామేజ్ గా మారే సంకేతాలు కనిపిస్తున్నాయి. దీన్ని ఎలా సరిదిద్దుకొంటాడో?