ఈరోజుల్లో సినిమా అంటే కాంబినేషన్ సెట్ అవ్వగానే క్రేజ్ మొదలైపోవాలి. ఆ తరవాతే టైటిల్, ట్రైలర్.. మిగిలిన వ్యవహారాలు. హీరో – దర్శకుడి పేర్లు పక్క పక్కన పడగానే మీడియా, మార్కెట్ అలెర్ట్ అయిపోవాలి. అందుకే కాంబో గురించి అంత తహతహలాడేది. అయితే చిరు ఇప్పుడు ఇవేం పట్టించుకోవడం లేదా? అనిపిస్తోంది. ఎందుకంటే ప్రస్తుతం తను ‘విశ్వంభర’ చేస్తున్నారు. వశిష్టకు దర్శకుడిగా ఇది రెండో సినిమా మాత్రమే. అంతకు ముందు కల్యాణ్ రామ్ తో ‘బింబిసార’తో హిట్ ఇచ్చి ఉండొచ్చు గాక. కానీ దర్శకుడిగా తన అనుభవం తక్కువన్నది నిజం.
‘విశ్వంభర’ తరవాత మోహన్ రాజా సినిమాకు చిరు ఓకే చెప్పారు. ఈ చిత్రానికి బీవీఎస్ రవి కథని అందించారు. ప్రస్తుతం కథపై కసరత్తులు ముమ్మరంగా జరుగుతున్నాయి. ‘విశ్వంభర’ తరవాత చిరు మొదలెట్టబోయే సినిమా దాదాపుగా ఇదే. మోహన్ రాజా చిరంజీవితో ఇది వరకు `గాడ్ ఫాదర్` తీశారు. ఆ సినిమా జస్ట్ యావరేజ్ అనిపించుకొంది. అందులోనూ రీమేక్. కాబట్టి మోహన్ రాజాపై చిరు అభిమానులకు పెద్దగా నమ్మకాలు కుదరవు. చిరు కోసం ఈమధ్య చాలామంది దర్శకులు కథలు పట్టుకొని రెడీ అయ్యారు. అందులో మారుతి, హరీష్ శంకర్, అనుదీప్, తమిళ దర్శకుడు హరి తదితరులు ఉన్నారు. వీళ్లలో ఏ ఒక్కరికి చిరు అవకాశం ఇచ్చినా కాంబో పరంగా క్రేజ్ వచ్చేది. కానీ చిరు ఆ పని చేయలేదు. బహుశా.. బీవీఎస్ రవి ఇచ్చిన కథ అంతగా నచ్చి ఉండొచ్చు. కథ బీవీఎస్ రవిది అయితే… దాన్ని ఏ హరీష్ శంకర్ చేతిలో పెట్టినా హ్యాండిల్ చేసేవాడు. కాంబో పరంగానూ సినిమాకు కళ వచ్చేది. ఈ ఆప్షన్ని చిరు ఎందుకు పక్కన పెట్టాడో అర్థం కావడం లేదు.