ఎమ్మెల్యేల కొనుగోలు కేసు హైకోర్టు సీబీఐకి ఇవ్వాలని నిర్ణయించడం బీఆర్ఎస్ పార్టీలో కొత్త సంచలనానికి కారణం అయింది. కేంద్రంపై యుద్ధానికి తనకు ఉన్న ఆయుధాన్ని కేసీఆర్ పోగొట్టుకున్నారని ఆ పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. కేంద్రానికేనా దర్యాప్తు సంస్థలు.. రాష్ట్రానికీ ఉన్నాయంటూ కేసీఆర్ చూపిన ధైర్యం ఇప్పుడు నీరుకారిపోయే పరిస్థితి ఏర్పడింది.
సీబీఐకి అప్పగిస్తూ తీర్పు వచ్చిన వెంటనే ప్రెస్ మీట్ పెట్టిన రోహిత్ రెడ్డి జైలుకు పంపినా సిద్ధమనేనని ప్రకటించారు. కేసును సీబీఐకి ఎలా ఇస్తారని ప్రశ్నించారు. ఆయనలో కనిపించిన ఆందోళన.. ఆయన ఒక్కడిదే కాదు.. మొత్తం బీఆర్ఎస్దని రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇప్పటికే రోహిత్ రెడ్డి ఈడీ తనపై తప్పుడు కేసులు పెట్టబోతోందని ఆందోళన వ్యక్తం చేశారు. నందకుమార్ దగ్గర పిర్యాదు తీసుకుని తనపై కేసులు పెట్టే చాన్స్ ఉందని .. ఆ మేరకు తనకు సమాచారం ఉందని ఆయన చెప్పుకొచ్చారు .
అసలు ఫామ్ హౌస్ కేసులో డబ్బుల చెలామణినే లేదని రోహిత్ రెడ్డి చెబుతున్నారు. అలాంటప్పుడు ఈడీ రాకూడదంటున్నారు. కోర్టుకు వెళ్తానని కూడా ప్రకటించారు. రోహత్ రెడ్డి కంగారు చూసిన రాజకీయవర్గాలకు.. “సమ్ ధింగ్ ఫిషి” అనిపించడం ఖాయం. ఎందుకంటే.. అసలు ఫామ్ హౌస్ కేసు రోహిత్ రెడ్డి చుట్టూనే తిరుగుతోంది. పార్టీ మారితే వంద కోట్లు ఇస్తామని.. నందకుమార్ ద్వారాబీజేపీ పెద్దలు ప్రలోభపెట్టారని ఆయన ఆరోపిస్తున్నారు. అసలు ఈ నందకుమార్ ఎవరంటే.. ఆయన బిజినెస్ పార్టనర్. సుదీర్ఘ కాంగా తెలిసిన వ్యక్తి. దీంతో అసలు ఫామ్ హౌస్ కేసులో బయటకు తెలిసింది కొంత.. తెలియాల్సింది ఎంతో ఉందన్న విషయం అర్థమవుతోంది.
నిజానికి ఫామ్ హౌస్ కేసును ట్రాప్ చేసినప్పుడు పోలీసులు రూ. పదిహేను కోట్ల వరకూ పట్టుకున్నట్లుగా ప్రచారం జరిగింది. కానీ పోలీసులు తర్వాత ఎలాంటి రికవరీ చూపించలేదు. ఒక వేళ చూపించి ఉంటే.. ఎప్పుడో ఈడీ అడుగు పెట్టి ఉండేది. ఈడీ రాకుండా ఉండటానికే ఇలా రికవరీ చూపించలేదన్న ఆరోపణలు కూడా వచ్చాయి. అయితే డబ్బుల్లేకపోయినా ఇప్పుడు ఈడీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తూ కేసును గుప్పిట్లోకి తీసుకుంటోంది. ఇప్పుడు సీబీఐ రంగంలోకి దిగుతోంది. అసలు ఈ కేసులో ఉన్న చిక్కుముళ్లన్నీ సీబీఐ విచారణలో తేలిపోయే అవకాశం ఉంది.
కారణం ఏదైనా సీబీఐ విచారణ ప్రారంభమైతే.. కోణం మారిపోయే అవకాశం ఉంది. పూర్తిగా నలుగురు ఎమ్మెల్యేల చుట్టూ తిరుగుతుంది. ఎవరు ఎమ్మెల్యేల కొనుగోలు కోసం ప్రయత్నించారన్న దగ్గర నుంచి… ఎలా ట్రాప్ చేశారు.. .డబ్బుల సమీకరణ ఎలా జరిగిందన్న అన్ని అంశాలనూ విచారణ చేయనుంది. ఇప్పటి వరకూ ఒక్క వైపు నుంచే ఈ కేసులో విషయాలు వెలుగు చూశాయి. సీబీఐ, ఈడీ విచారణలో ఎవరూ ఊహించని విషయాలు వెలుగు చూస్తాయని భావిస్తున్నారు.