‘రైతు రుణమాఫీ హామీ’.. అన్నదాతలపై ప్రేమతో చేస్తున్నదా… లేదా, రైతు ఓటు బ్యాంకుని ఈజీగా క్యాప్చర్ చెయ్యొచ్చన్న ఉద్దేశంతో పార్టీలు ఎర వేస్తున్నదా..? నిజం ఏదైనప్పటికీ ఎడాపెడా రుణమాఫీలు ప్రకటించడం భవిష్యత్తులో రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆందోళన వ్యక్తం చేయడం విశేషం. రుణమాఫీ హామీలు ప్రమాదకరంగా మారుతాయని మరోసారి ఆర్బీఐ హెచ్చరించింది. ఉత్తరప్రదేశ్, మహారాష్ట్రల్లో అన్నదాతలకు సంబంధించిన రూ. 30 వేల కోట్ల ప్యాకేజీలను ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ ఈ కీలక వ్యాఖ్యలు చేయడం విశేషం. రుణమాఫీలు ఇష్టానుసారంగా ప్రకటించుకుంటూ పోతే ఆయా రాష్ట్రాలు ద్రవ్యోల్బణ పరిస్థితులను ఫేస్ చేయాల్సి ఉంటుందని ఆయన అన్నారు.
2019 ఎన్నికల్లో దేశవ్యాప్తంగా రైతు రుణమాఫీ హామీలే ఎక్కువగా ఉంటాయంటూ తాజాగా ఓ సర్వే వెల్లడించింది. అమెరికాకు చెందిన ఓ సంస్థ మనదేశంలో వచ్చే ఎన్నికల నాటి పరిస్థితులపై ఓ అధ్యయనం చేసింది. దీని ప్రకారం దేశంలోని వివిధ రాజకీయ పార్టీలన్నీ కలిసి దాదాపు రెండున్న ట్రిలియన్ రూపాయల మేర రైతు రుణాల మాఫీకి సంబంధించి హామీలు ఇవ్వొచ్చని అంచనా వేశారు. దీంతో దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడుతుందని ఆ సంస్థ హెచ్చరించింది. ఓ పక్క ఆర్బీఐ కూడా ఇలాంటి ప్రమాద హెచ్చరికలే చేస్తోంది. అయితే, వీటని రాజకీయాలు పార్టీలు ఎంత మేరకు సీరియస్ గా తీసుకుంటాయనేది ఇక్కడ అసలు ప్రశ్న.
నిజానికి, ప్రస్తుతం అధికారంలో ఉన్న భాజపానే రుణమాఫీల వైపు మొగ్గుతోంది. ఆ మధ్య ఉత్తరప్రదేశ్ ఎన్నికలు జరిగితే… స్వయంగా ప్రధాని నరేంద్ర మోడీనే రుణమాఫీ చేస్తామని హామీ ఇవ్వడం విశేషం. అంటే, గత ఎన్నికల్లో కొన్ని రాష్ట్రాలకు మాత్రమే పరిమితమైన ఆ హామీ.. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో జాతీయ పార్టీల ప్రధాన అజెండాగా మారే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్ చేస్తున్న ఈ హెచ్చరికల్ని రాజకీయ పార్టీలు సీరియస్ తీసుకునే పరిస్థితి ఉండదనే చెప్పాలి. ఎందుకంటే, ఎన్నికలు అనేసరికి అన్ని పార్టీలకూ అధికారం దక్కించుకోవడమే ప్రధాన లక్ష్యం. దాని కోసం చేతికి ఎముకలేదన్నట్టుగా దానాలు చేసేస్తామంటూ హామీలు ఇచ్చేస్తారు. వాటి అమలు సంగతి తరువాత ఆలోచిద్దాం అనుకుంటున్నారు. అలా చెయ్యడం వల్లనే పరిస్థితి ఇలా మారుతోంది. తెలుగు రాష్ట్రాల విషయమే తీసుకుంటే.. రుణమాఫీ హామీలను అమలు చేయడం కోసం నానా అవస్థలూ పడుతున్నారు ఆంధ్రా, తెలంగాణ సీఎంలు.
2019 ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిస్తే రూ. 2 లక్షల రుణమాఫీ చేసేస్తామంటూ తెలంగాణ నేతలు ఈ మధ్యనే ప్రకటించేశారు. ఇక, ఆంధ్రాలో సంగతి చెప్పాల్సిన పనే లేదు. ఏ రంగానికి చెందిన బాధితుల్ని పరామర్శించినా.. తాము అధికారంలోకి వచ్చాక చాలా మాఫీలూ, భారీ ఎత్తున పరిహారాలు ఉంటాయంటూ వైకాపా కూడా హామీలు ఇచ్చేస్తోంది. రైతురుణ మాఫీ హామీని ఒక సక్సెస్ ఫుల్ ఫార్ములాగానే రాజకీయ పార్టీలు చూస్తున్నాయి. అంతేగానీ, దాని వల్ల దేశ ఆర్థిక వ్యవస్థపై పడే ప్రభావాన్ని విశ్లేషించేంత విశాల దృక్పథంతో ఆలోచిస్తున్న దాఖలాలు కనిపించడం లేదు.