కర్నూలు జిల్లాలో దశాబ్దాలుగా రైతు కు ఎదురవుతున్న అవమానం మళ్లీ ఎదురైంది. కిలో టమోటా ధర లో 30 పైసలకు పడిపోవడం తో, తిరిగి వెనక్కి వెళ్ళడానికి కావలసిన ట్రాన్స్పోర్ట్ ధరలు కూడా రాకపోవడంతో రోడ్డుమీద టమాటలను పారబోసి రైతులు నిరసన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఎన్నికలకు ముందు జగన్ ఇచ్చిన ధరల స్థిరీకరణ నిధి హామీ ఏమైంది అంటూ చర్చ బయలుదేరింది. వివరాల్లోకి వెళితే.
కర్నూలు జిల్లాలో టమాటా రైతులు, ఉల్లి రైతులు ఈ తరహా అన్యాయాన్ని ఎదుర్కోవడం దశాబ్దాలుగా జరుగుతోంది. పంట దిగుబడి వచ్చిన సమయంలో ధరలు విపరీతంగా పడిపోవడం, దళారులు, మార్కెట్ యార్డులు తక్కువ ధరలో పంట కొన్న తర్వాత ధరలు అమాంతం పెరగడం, తద్వారా అటు రైతులు ఇటు వినియోగదారులు నష్టపోయి దళారీలు మాత్రం లాభం పడటం దశాబ్దాలుగా జరుగుతోంది. అయితే ఎన్నికలకు ముందు ఈ సమస్యపై అప్పటి ప్రతిపక్ష హోదా లో మాట్లాడిన జగన్ , దేవుడి దయ వల్ల తమ ప్రభుత్వం గనక 2019 ఎన్నికల తర్వాత ఏర్పడినట్లయితే, మూడు వేల కోట్లతో తాను ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తానని, తద్వారా కొన్ని రోజుల పాటు అత్యధిక ధరలు మరికొన్ని రోజులు అత్యల్ప ధరలు ఉండే పరిస్థితి ఏర్పడదని జగన్ హామీ ఇచ్చారు. అయితే ధరల స్థిరీకరణ నిధి మాట దేవుడెరుగు, మార్కెట్ యార్డ్ నుండి తిరిగి వెనక్కి వెళ్ళడానికి కావలసిన రవాణా చార్జీలు కూడా రానంత తక్కువ ధరకు టమాటా పడిపోవడంతో కర్నూలు జిల్లా రైతులు రోడ్డు మీద పంట పారబోసి నిరసన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తక్షణం జోక్యం చేసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.
ఇచ్చిన హామీల లో అనేక అంశాల్లో ఇలా వ్యతిరేకత రావడం ఈమధ్య జగన్ ప్రభుత్వానికి తరచు ఎదురవుతోంది. మరి కర్నూలు జిల్లా టమాట రైతుల సమస్య విషయంలో ప్రభుత్వం జోక్యం చేసుకుంటుందా, హామీ ఇచ్చినట్లుగా ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తుందా అన్నది వేచి చూడాలి.