టాలీవుడ్‌కి ఏదో అయ్యింది. వరుస పరాజయాలు ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. ఫ్లాపుల మాట అటుంచితే… చిత్రబృందం పరువులు పోయే ఫలితాల్ని మూటగట్టుకోవడం మరింత విషాదాన్ని మిగులుస్తోంది. జనవరిలో పెద్ద సినిమాలు హడావుడి చేసినా `ఎఫ్ 2` రూపంలో ఒకే ఒక్క విజయాన్ని దక్కించుకుని `బతుకుజీవుడా` అంటూ గట్టెక్కేసింది చిత్రసీమ. ఫిబ్రవరిలో మరీ దారుణం. ఆ ఒక్కటీ కూడా లభించలేదు. వరుస ఫ్లాపులు షాకిచ్చాయి. సినిమాలు ఇబ్బుడి ముబ్బుడిగా వచ్చినా – ప్రతీవారం రెండు మూడు సినిమాలు హడావుడి చేసినా కాసుల వర్షం కురిపించిన సినిమా ఒక్కటీ లేదు. దాంతో బాక్సాఫీసు కళ తప్పింది. థియేటర్లు వెలవెలబోతున్నాయి.
అటు డబ్బింగ్, ఇటు స్ట్రయిట్ సినిమాలు మొత్తం కలిసి ఈ నెలలో 18 సినిమాలొచ్చాయి. వాటిలో చెప్పుకోదగినవి మహానాయకుడు, దేవ్, యాత్ర..
కథానాయకుడు ఇచ్చిన షాక్‌ని మహానాయకుడు కంటిన్యూ చేసింది. ఈ సినిమా కూడా ఘోర పరాజయాన్ని అందుకుని బాలయ్య అభిమానుల్ని మరింత నిరుత్సాహానికి గురి చేసింది. తొలి భాగం 20 కోట్లు సాధిస్తే.. రెండో భాగం అందులో పావు వంతు కూడా తెచ్చుకోలేక సతమతమవుతోంది. వై.ఎస్.ఆర్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన యాత్రం `ఓకే` అనిపించుకుంది. మహి వి.రాఘవకు ప్రశంసలు వచ్చినా, వసూళ్ల విజయంలో యాత్రకు అన్యాయమే జరిగింది. మమ్ముట్టికి బలమైన మార్కెట్ ఉన్న కేరళలోనూ ఈ చిత్రం పెద్దగా ఆడలేదు. ఇక `దేవ్` సంగతి చెప్పనవసరం లేదు. కార్తి మార్కెట్ నానాటికీ తీసికట్టుగా తయారవుతుందని చెప్పడానికి ఈ సినిమానే ఉదాహరణ. కనీసం ఓపెనింగ్స్ కూడా అందలేదు. రివ్యూలూ అంతే దారుణంగా వచ్చాయి.
ఈ నెలలో డబ్బింగ్ సినిమాల హవా ఎక్కువగా కనిపించింది. అంజలి సీబీఐ, విచారణ, లవర్స్‌డే, సీమరాజా, అమావాస్య… ఇలా ఓ ఏడెనిమిది డబ్బింగ్ సినిమాలు వరుస కట్టాయి. అయితే అందరి దృష్టి లవర్స్ డేపైనే ఉంది. ప్రియా వారియర్ సినిమా కావడంతో.. ఫోకస్ తెచ్చుకుంది. కానీ దారుణమైన కథ కథనాలు, పేలవమైన టేకింగ్‌తో ఈ సినిమా అట్టర్ ఫ్లాప్‌గా మిగిలిపోయింది. చిత్రబృందం క్లైమాక్స్ మార్చి మళ్లీ విడుదల చేసినా ప్రేక్షకులు కనికరించలేదు. సీమరాజా, అమావాస్యలాంటి చిత్రాల సంగతి సరే సరి. సరైన పబ్లిసిటీ లేకపోవడం కూడా.. వసూళ్లపై ప్రభావం చూపించింది.
మొత్తానికి ఫిబ్రవరిలోనూ తెలుగు చిత్రసీమకు నిరాశే ఎదురైంది. సరైన సినిమాలు లేకపోవడం, వచ్చిన సినిమాలు ఆడకపోవడంతో బయ్యర్లు తీవ్రంగా నష్టపోయారు. కొన్ని చోట్ల థియేటర్లు మూసుకోవాల్సిన పరిస్థితి దాపురించింది. సాధారణంగా ఫిబ్రవరి, మార్చి అంటే బ్యాడ్ సీజన్ అంటుంటారు. ఈసారి… అది మరింత బ్యాడ్‌గా మారిపోయింది. మరి మార్చి అయినా టాలీవుడ్ తలరాతను మార్చుతుందేమో చూడాలి.