మాటలతో మాయ చేయడం, అరచేతిలో వైకుంఠం చూపించడం ప్రధాని మోడీకి బాగా తెలుసు. ఆయన మాట్లాడుతుంటే… దేశం ఎటో వెళ్లిపోతోందన్న భావన కలుగుతుంది. క్షేత్రస్థాయిలో వాస్తవాలు వేరేలా ఉంటాయనుకోండి. తాజాగా, పార్టీ 37వ వ్యవస్థాపక దినోత్సవం జరిగింది. ఈ సందర్భంగా జార్ఖండ్ లో జరిగిన ఓ కార్యక్రమంలో మోడీ మాట్లాడారు. అవినీతి గురించీ, నల్లధనంపై పోరాటం గురించి ప్రసంగించారు. నిజానికి.. ఈ రెండు టాపిక్ లు ఈ మధ్య టచ్ చేయడం మానేశారు. ఐదు రాష్ట్రాల ఎన్నికలు పూర్తయ్యే వరకూ వీటి జోలికి పెద్దగా వెళ్లలేదు. మళ్లీ ఇప్పుడీ టాపిక్ తెరమీదికి తెస్తున్నారు. అవినీతిపై పోరాటం కొనసాగిస్తున్నామనీ, నల్లధనం అంతం చూస్తామని మోడీజీ అన్నారు. ఈ పోరాటం ఎప్పటికీ ఆగదని అన్నారు.
వినడానికి చాలా బాగున్నాయి. ఏదో జరిగిపోతోందన్నట్టుగా ఉంది! కానీ, ఏం జరిగింది..? ఈ పోరాటం ఎక్కడ జరుగుతోంది. గత ఏడాది నంబర్ 8 న మొదలుపెట్టిన నల్లధనం పోరాటం ఇప్పుడు ఏ దశలో ఉంది..? ఇలాంటి విషయాలేవీ మాట్లాడకుండా.. భాజపా పోరాటం కొనసాగిస్తోందంటే వినడానికి విడ్డూరంగా ఉంది. పెద్ద నోట్ల రద్దు నిర్ణయం ద్వారా మనం సాధించింది ఏంటో సగటు భారతీయకుడికి ఇప్పటికీ అర్థం కావడం లేదు. చిల్లర పైసల కోసం బ్యాంకుల ముందు క్యూ లైన్లలో నిలబడి… ‘దేశం కోసం మోడీ చేలా చేస్తున్నారు. అలాంటప్పుడు, మన కోసం మనం ఈ మాత్రం చేయలేమా..? నాల్రోజులు బ్యాంకుల ముందు వెయిట్ చేద్దాం’ అంటూ సర్దిచెప్పుకుని సామాన్యులు చాలా ఇబ్బందులు పడ్డారు.
మరి, మోడీ చెబుతున్న ఈ పోరాటంలో పాల్గొన్న సామాన్యులు సాధించింది ఏంటి..? దీనికి సమాధానం లేదు. అది సరే, బ్యాంకుల్లో కోట్లకు కోట్లు వచ్చిన డిపాజిట్ల పరిస్థితి ఏంటి..? దీనికీ లెక్కాపత్రం లేదు. గడచిన నెలలో కూడా నగదుకు తీవ్ర కొరత వచ్చింది. ఇప్పటికీ నూటికి నూరు శాతం దేశంలోని ఏటీఎమ్ లు పనిచేయడం లేదు. ఈ పరిస్థితి ఎందుకొస్తోంది..? నగదుపై రకరకాల పరిమితులూ షరతులూ విధిస్తూ ఇప్పటికీ సామాన్యుడిని గందరగోళానికి గురిచేస్తున్నారు. ఈ పరిస్థితిపై స్పందన ఏది..?
జనాల కష్టాలు కాసేపు పక్కన పెడదాం. మోడీ గొప్పగా చెబుతున్న నల్లధనంపై పోరాటం ఎక్కడ జరిగింది..? ఎవరిపై జరిగింది..? ఇంతవరకూ బయటపడ్డ ఆ నల్లకుబేరుల జాబితా ఏది..? ప్రభుత్వం ఎవరిపై చర్యలు తీసుకుంది..? ఇలాంటి ప్రశ్నలకు సమాధానం వారి దగ్గర లేదు! వాస్తవాలు ఇలా ఉంటే వాటిని వదిలేసి… ఇంకా పోరాటమనీ, ఆగేదిలేదనీ, దూసుకెళ్తామనీ, దున్నేస్తామనీ, ఇరగదీసేస్తామనీ.. ఎందుకండీ ఈ పడికట్టు పదప్రయోగాల హడావుడి. ఇలాంటివి వినీవినీ సామాన్యుడి చెవులు ఇప్పటికే తుప్పుపట్టిపోయాయి.