ప్రత్యేక హోదా ఏ మార్గంలో సాధించుకుంటారు అనే అంశంపై ఇప్పటికీ స్పష్టత ఇవ్వలేకపోతున్నారు వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి. ఎవరైతే ఏపీ హోదాను ప్రకటిస్తారో వారికే మద్దతు ఇస్తామంటున్నారు. లాజికల్ గా ఇక్కడే అసలు సమస్య ఉందని ఇంకా గుర్తించడం లేదు. కేంద్రంలో ప్రభుత్వం ఏర్పడితే తప్ప ఎవరైనాసరే హోదా ప్రకటిస్తూ సంతకాలు చెయ్యలేరు. ఆ లెక్కన ప్రభుత్వం ఏర్పడకముందే ఎవరో ఒకరికి జగన్ మద్దతు ప్రకటించాల్సి ఉంటుంది. కేంద్రంలో ఎవరికి మద్దతు ఇస్తారనేది జగన్ ఇంకా స్పష్టంగా చెప్పడం లేదు. కేసీఆర్ ప్రతిపాదిస్తున్న ఫెడరల్ ఫ్రెంట్ వైపు ఉంటారని మాత్రం సంకేతాలు ఇచ్చారు. పోనీ, ఆ ఫ్రెంట్ కి అప్రకటిత నాయకత్వ హోదాను స్వయం ప్రకటన చేసుకున్న కేసీఆర్ అయినా ఏపీ ప్రత్యేక హోదా గురించి సానుకూలంగా మాట్లాడుతున్నారా.. అదీ లేదు.
రాష్ట్రంలోని అన్ని ఎంపీ స్థానాలు వైకాపా గెలుచుకుంటే ప్రత్యేక హోదా సాధ్యమౌతుందన్నారు జగన్. విజయనగరం జిల్లాలో జరిగిన ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ… హోదా ఇస్తామన్న పార్టీకే మద్దతు ఉంటుందని మరోసారి చెప్పారు. హోదా ఇస్తామని ఎవరు సంతకం పెడితే వారితోనే జాతీయ రాజకీయాలు అన్నారు. మన ఎంపీలతోపాటు, తెలంగాణలోని 17 మంది ఎంపీలు ఒకేతాటిపైకి వచ్చి, ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేస్తే, కేంద్రంలో ఎవరున్నా ఇచ్చి తీరాల్సిందే అన్నారు. జాతీయ పార్టీలకు సొంతంగా మెజారిటీ వచ్చే పరిస్థితి కనిపించడం లేదనీ, అలాంటప్పుడు 42 ఎంపీ సీట్లు ఉన్నవారి మాటను ప్రధాని స్థానంలో కూర్చున్న ఎవరైనా వినాల్సి వస్తుందనీ, హోదా అడిగితే వెంటనే సంతకం పెట్టాల్సి వస్తుందన్నారు.
ఏపీ ప్రత్యేక హోదాకి తెలంగాణ కూడా అత్యంత సానుకూలంగా ఉందన్నట్టుగా జగన్ మాట్లాడుతున్నారు. తెలంగాణ ఎంపీలందరూ ఏపీకి అనుకూలంగానే ఢిల్లీలో డిమాండ్ చేస్తారని ఈయన భరోసా ఇచ్చేస్తున్నారు! సరే, ఎలాగూ కేసీఆర్ ఫెడరల్ ఫ్రెంట్ తో ముందుకెళ్లాలని జగన్ అనుకుంటున్నారు కదా! అలాంటప్పుడు, ఎన్నికలు పూర్తయ్యేవరకూ ఎందుకు… ఇప్పుడే, ఏపీ హోదాకి కట్టుబడి ఉన్నామనీ, ఎన్నికల తరువాత వైకాపా ఎంపీలతో కలిసికట్టుగా ముందుకు సాగి… కేంద్రాన్ని డిమాండ్ చేస్తామని కేసీఆర్ తో జగన్ ప్రకటన చేయించగలరా..? కేసీఆర్ తో ఆ మాట చెప్పించగలిగితే… హోదా సాధనకు జగన్ దగ్గర ఒక స్పష్టమైన మార్గం ఉందని ప్రజలకీ తెలుస్తుంది. కానీ, ఆ ప్రయత్నం జగన్ చెయ్యరు. ఆ ప్రకటనా కేసీఆర్ తో ఇప్పుడు చేయించలేరు! ఈ లెక్కన ప్రత్యేక హోదా సాధనకు వైకాపా దగ్గర ఉన్న స్పష్టమైన వ్యూహం ఏది..? ఇప్పుడు జగన్ చెబుతున్న మాటలన్నీ ఊహాజనితాలే. కేసీఆర్ కి 16 ఎంపీ సీట్లు గెలవాలి, వైకాపా 25 గెలవాలి. ఈ రెండూ సాధ్యమవ్వాలి… ఆ తరువాత, ఏపీ హోదాకి అనుకూలంగా కేసీఆర్ మాట్లాడాలి. ఈ మార్గం కాస్త కష్టసాధ్యంగా కనిపిస్తోంది.