తెలుగు రాష్ట్రాలు వరదల్లో మునిగిపోయాయి. ఎక్కడ చూసినా నీళ్లే. ముఖ్యంగా విజయవాడ పరిసర ప్రాంతాలు అల్లాడుతున్నాయి. వరద నష్టం ఇంతని చెప్పలేం. అందుకే ఎవరికి తోచిన విధంగా వాళ్లు సహాయ సహకారాలు అందిస్తున్నారు. ముఖ్యంగా సినిమా స్టార్లు ఈసారి గట్టిగానే స్పందించారు. పెద్ద స్టార్లెవరూ కోటికి తగ్గలేదు. పవన్ కల్యాణ్ అయితే రూ.6 కోట్లు ఇచ్చి, తన గొప్ప మనసు మరోసారి చాటుకొన్నాడు. యువ హీరోలూ తమకు తోచినంత సాయం చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు ఫిల్మ్ ఛాంబర్ కూడా ముందుకు వచ్చింది. తమ వంతు సహాయంగా రూ.50 లక్షల విరాళం ప్రకటించింది. ఇక ముందు కూడా ప్రజలకు ఎలాంటి సహాయం కావాలన్నా మేం అందిస్తాం.. అంటూ ధైర్యాన్ని ఇచ్చింది. అంతేకాదు, ప్రజల నుంచి విరాళాల సేకరణ కోసం ఓ వినూత్న ఆలోచన కూడా చేసింది.
థియేటర్ల దగ్గర స్పెషల్ కౌంటర్ ఏర్పాటు చేసి, ప్రజల దగ్గర్నుంచి విరాళాలు సేకరించాలని ఛాంబర్ పెద్దలు నిర్ణయించారు. నిజానికి ఇది మంచి ఆలోచనే. ఇలా రూపాయి రూపాయి సేకరిస్తే తప్పకుండా పెద్ద మొత్తమే అవుతుంది. ఈ విపత్తులో తమ వంతు సహాయం అందించిన సంతృప్తి ప్రజలకూ ఉంటుంది. వినోదం కోసం సినిమాకు వెళ్లిన ప్రేక్షకుడు చిరు తిళ్ల ఖర్చుని విరాళంగా ఇచ్చినా అది గొప్ప విషయమే. కాకపోతే… థియేటర్లకు ప్రేక్షకులే రావడం గగనం అయ్యింది. సినిమాల వరకూ ఇది మంచి సీజన్ కూడా కాదు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఈ ఐడియా వర్కవుట్ అవ్వాలనే కోరుకొందాం. వరద ఉధృతి కాస్త తగ్గాక, పరిస్థితులు అదుపులోకి వచ్చాక, సినిమా వాళ్లంతా కలిసి ఛారిటీ కోసం ఏదైనా ఓ పెద్ద కార్యక్రమం నిర్వహిస్తే అది ఇంకా బాగుంటుంది.