సెప్టెంబరు 20… అక్కినేని నాగేశ్వరరావు పుట్టినరోజు. ఇది ఆయన శత జయంతి సంవత్సరం. ఈ సందర్భంగా అక్కినేని క్లాసిక్స్‌ని మరోసారి ప్రేక్షకుల ముందుకు తీసుకెళ్లాలని ఫిలిం హెరిటేజ్ ఫౌండేషన్ నిర్ణయించింది. ‘ఏఎన్నార్ 100: కింగ్ ఆఫ్ ది సిల్వర్ స్క్రీన్’ పేరుతో ప్రత్యేక ప్రదర్శనలకు రంగం సిద్ధం చేసింది. అక్కినేని చిత్రాల్లో 10 క్లాసిక్స్‌ని ఎంపిక చేసి, దేశం నలుమూలలా వివిధ ప్రాంతాలలో ప్రదర్శించనున్నారు. సెప్టెంబరు 20 నుంచి 22 వరకూ ఈ ప్రత్యేక ప్రదర్శనలు కొనసాగుతాయి. హైదరాబాద్, ముంబై, ఢిల్లీ, బెంగళూరు, వరంగల్, కాకినాడ, తుమకూరు, వడోదర, జలంధర్, రూల్కెలాతో సహా మొత్తం 25 ఎంపిక చేయబడిన ప్రాంతాలలో అక్కినేని గోల్డెన్ హిట్స్ చూడొచ్చు.
అక్కినేని సూపర్ హిట్ చిత్రాలలో దేవదాసు, మిస్సమ్మ, భార్యభర్తలు, గుండమ్మ కథ, మాయాబజార్, డా.చక్రవర్తి, సుడి గుండాలు, ప్రేమ్ నగర్, ప్రేమాభిషేకం, మనం.. ఈ చిత్రాల్ని ఎంపిక చేసింది హెరిటేజ్ ఫౌండేషన్. ఇది వరకు ఈ సంస్థ ద్వారా అమితాబ్‌బచ్చన్, దిలీప్ కుమార్, దేవానంద్ చిత్రాలు ఇలానే విడుదలయ్యాయి. వాటికి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఈసారి కూడా అక్కినేని చిత్రాలకు ఇలాంటి ఆదరణే దక్కుతుందని నిర్వాహకులు భావిస్తున్నారు. పాత చిత్రాల్ని మళ్లీ మళ్లీ థియేటర్లలో చూడడానికి ఇష్టపడుతున్న ఈతరం అక్కినేని క్లాసిక్స్‌కు ఎలాంటి ఆదరణ అందిస్తారో చూడాలి.