తెలంగాణ అసెంబ్లీలో పవర్ పాయింట్ వార్ జరగనుంది. ఆర్థిక పరిస్థితిపై నేడు పూర్తి స్థాయిలో ప్రజెంటేషన్ ఇవ్వాలని తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందు కోసం ఏర్పాట్లు చేసింది. తెలంగాణ ఏర్పాటు చేసినప్పుడు మిగులు రాష్ట్రంగా ఉన్న ప్రభుత్వాన్ని ఎలా అప్పుల పాలు చేశారో కాంగ్రెస్ ప్రభుత్వం వివరించే అవకాశం ఉంది. ఇందు కోసం ఇప్పటికే అన్ని వివరాలను సేకరించి.. మొత్తంగా ప్రజెంటేషన్ రెడీ చేశారు.
అసెంబ్లీలో ప్రకటించే వివరాలు చూస్తే ప్రజలు కూడా ఆశ్చర్యపోతారని.. ఇన్ని లక్షల కోట్ల అప్పులు చేసి ఏం చేశారని ప్రజలు బీఆర్ఎస్ నేతల్ని నిలదీసే అవకాశం ఉంటుందని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. ఈ అంశంపై బీఆర్ఎస్లో ఇప్పటికే కంగారు కనిపిస్తోంది. తమకూ ప్రజెంటేషన్ ఇచ్చే అవకాశం కల్పించాలని స్పీకర్‌కు హరీష్ రావు లేఖ రాశారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు విపక్ష సభ్యులకు కనీసం మాట్లాడే అవకాశం లభించేది కాదు. కానీ ఇప్పుడు ప్రత్యేక ప్రజెంటేషన్ కు సమయం కావాలని కోరుతున్నారు. స్పీకర్ ఇస్తారో లేదో స్పష్టత లేదు.
కేటీఆర్ కూడా… హామీలు ఎగ్గొట్టడానికి బీఆర్ఎస్ ను బూచిగా చూపేందుకు… గత ప్రభుత్వం అప్పులు చేసేందుకు చెప్పేందుకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పేరుతో నాటకాలు వేస్తున్నారని అంటున్నారు. కాగ్ వంటి సంస్థల రిపోర్టులు శ్వేతపత్రం కాదా అని ఆయన ప్రశ్నిస్తున్నారు. అప్పుల పేరుతో హామీలు ఎగ్గొడితే ఊరుకునేది లేదంటున్నారు.
అప్పులు గురించి చెబుతున్నారు కానీ.. సృష్టిచిన సంపద గురించి చెప్పడం లేదని.. బీఆర్ఎస్ నేతల వాదన. అసెంబ్లీలో వారు తమ వెర్షన్ ఎలా వినిపిస్తారన్నది ఆసక్తికరం. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనివ్వకుండా గందరగోళం చేసి సస్పెండ్ అయ్యే వ్యూహం పాటిస్తారా… అంతా విని తమ వాదన వినిపించేందుకు అవకాశం పొందుతారా అన్నది చూడాల్సి ఉంది.