టాలీవుడ్ లో పేరున్న ప్రముఖ నిర్మాణ సంస్థ అది. పెద్ద హీరోలందరితోనూ సినిమాలు చేసింది. పేరున్న దర్శకులందరికీ అడ్వాన్సులు ఇచ్చింది. బాలీవుడ్ లోనూ సినిమాలు చేయడానికి రంగం సిద్ధం చేసుకొంది. ఇప్పుడు ఓ భారీ ప్రాజెక్ట్ సెట్స్ పై ఉంది. కానీ… చిత్రం ఏమిటంటే చేతిలో డబ్బులు లేవు. అందుకే ఇప్పుడు అప్పుల కోసం అన్వేషిస్తోంది. పెట్టుబడి అంతా ఓ సినిమాపై పెట్టేసిన ఈ సంస్థ కొత్త ప్రాజెక్టులను సెట్ చేయడానికి, సెట్స్‌పైకి తీసుకెళ్లడానికి డబ్బులు అవసరమయ్యాయి. ఈ పెట్టుబడి రాబట్టడానికి బాలీవుడ్ నిర్మాణ సంస్థలతో టై అప్ చేసుకోవాలని చూస్తోంది. ముంబైలో ఫైనాన్షియర్లతో మీటింగులు పెట్టుకొంటోంది.
నిజానికి ఈ సంస్థ వెనుక చాలామంది పెద్ద వాళ్ల హస్తం ఉందని, వాళ్లే… బినామీలుగా ఏర్పడి, పెట్టుబడి పెడుడతున్నారని బయట టాక్ ఉంది. కానీ వాళ్లంతా ఒకొక్కరుగా సైడ్ అయిపోవడం, వరుస పరాజయాలు ఈ సంస్థని ఆర్థికంగా కుదిపేశాయి. దాంతో పెట్టుబడి పెట్టడానికి తోడ్పాటు అవసరమైంది. ఈ నేపథ్యంలోనే ముంబైలో ఫైనాన్షియర్లతో సమావేశాలు మొదలయ్యాయని తెలుస్తోంది. బ్యానర్ వాల్యూని వాడుకొని సినిమాలు చేయడానికి కొన్ని సంస్థలు కూడా ముందుకు వస్తున్నట్టు సమాచారం. ప్రస్తుతానికి ఫైనాన్షియర్లు దొరికినట్టే. చేతిలో ఉన్న సినిమాలకు కాస్త ఊతం వస్తుంది. కానీ ఇదే పరిస్థితి కొనసాగితే, సంస్థ మనుగడకే ముప్పు ఏర్పడుతుంది. కాంబినేషన్ల మోజుతో సినిమాల్ని సెట్ చేసుకోకుండా, కథపై, కంటెంట్ పై ఫోకస్ పెడితే తప్ప ఈ సంస్థ కోలుకోవడం కష్టమని ట్రేడ్ వర్గాలు జోస్యం చెబుతున్నాయి. నిర్మాతల ఆర్థిక పరిస్థితి తెలుసుకొంటున్న హీరోలు కూడా.. ఇప్పుడు ఈ సంస్థతో సినిమాలు చేయడానికి అంతగా ఆసక్తి చూపించడం లేదని టాక్.