ఆంధ్రప్రదేశ్లో చేపలు అమ్ముకుని బతకాలంటే ఎడాదికి రూ. పది వేలు లైసెన్స్ ఫీజు కట్టాల్సిందే. చేపలు అమ్ముకోవడానికి లైసెన్స్ ఫీజేమిటంటే మహా ప్రభో అని ఎవరైనా అంటే.. వారిపై కుట్ర కేసులు నిర్మోహమాటంగా పెడతారు. ఆదాయం లేక.. ఖర్చులు పెరిగిపోయి ఆదాయ మార్గాల కోసం చూస్తున్న ప్రభుత్వానికి చేపలు అమ్ముకునే మత్య్స కారులు కనబడ్డారు. వారిపై పది నుంచి పాతిక వేల రూపాయల వరకూ లైసెన్స్ ఫీజు రుద్దుతున్నారు.
ఏపీలో చేతలు అమ్ముకునేవారు ఎక్కువగా చిన్న చిన్న దుకాణాల్లోనే ఉంటారు. ఎప్పటికప్పుడు చెరువు దగ్గర .. లేకపోతే నదుల దగ్గర నుంచి తెచ్చుకుని మార్కెట్ల దగ్గర పెట్టుకుని అమ్ముకుంటూ ఉంటారు. వారికి ఆదాయం.. రోజు కూలీ చేసుకున్నంత వస్తుందో రాదో కూడా తెలియదు. కానీ వారి వద్ద నుంచి రూ. పదివేలు మాత్రం వసూలు చేసి తీరాలన్న పట్టుదలతో ప్రభుత్వం ఉంది.
ఇప్పటికే చేపలమ్ముకునేవారిపై పగబట్టినట్లుగా ప్రభుత్వం వ్యవహరిస్తోంది. ప్రభుత్వ ఆధ్వర్యంలో ఫిష్ ఆంధ్రా ఔట్ లెట్లు తెరిచారు. మత్స్యకారుల పొట్టకొట్టే ప్రయత్నం చేశారు. అయితే అవి సక్సెస్ కాలేదు. వాటికి మాత్రం ఎలాంటి లైసెన్స్ ఫీజు తీసుకోకూడదని ప్రభుత్వం చెబుతోంది. అంటే లైసెన్స్ ఫీజు తట్టుకోలేక.. చేపలు అమ్ముకునేవారిలో ఎవరైనా ఫిష్ ఆంధ్రా ఔట్ లెట్లు తీసుకుంటారని ప్రభుత్వం ప్లాన్ చేస్తోందన్న అభిప్రాయం వినిపిస్తోంది. కారణం ఏదైనా… ఇప్పుడు మత్య్సకారులను పిండుకోవడానికి ప్రభుత్వం రంగం సిద్ధం చేసుకుంది.