తెలంగాణ రాష్ట్రం ఏర్పాటై ఈరోజుకి నాలుగేళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తోంది కేసీఆర్ సర్కారు. రాష్ట్ర సాధన పోరాటాన్ని గుర్తు చేసుకుంటూ, ఈ నాలుగేళ్లలో సాధించిన అభివృద్ధి, సంక్షేమం గురించి ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ప్రజలకు మరోసారి వివరించనున్నారు. మరీ ముఖ్యంగా, విద్యార్థులకు తీపి కబురు అందించబోతున్నారు. ఎన్నాళ్లుగానో నిరుద్యోగులు ఎదురుచూస్తున్న ప్రభుత్వ ఉద్యోగాల నియామక నోటిఫికేన్లపై ఈరోజు ప్రకటన చేసే అవకాశం ఉంది. కొత్తగా తెలంగాణలో జోన్లను కూడా ఏర్పాటు చేశారు. దీంతో కొత్త ఉద్యోగాల నియామకానికి మార్గం సుగమం అయింది. ఇక, ఆవిర్భావ వేడుకలను భాగ్యనగరాన్ని సుందరంగా అలంకరించారు. ఈ వేడుకల్లో భాగంగా ముగ్గురు పోలీసు అధికారులకు సర్వోన్నత పతకాలను ఇస్తున్నారు.
తెలంగాణ ఏర్పడ్డ తరువాత కేసీఆర్ సర్కారు వ్యవసాయానికి ప్రాధాన్యత ఇచ్చిందనడంలో సందేహం లేదు. తాజాగా ప్రకటించిన రైతు బంధు పథకమే అందుకు సాక్ష్యం. దీంతోపాటు, భారీ నీటిపారుదల ప్రాజెక్టులు చేపట్టింది. రూ. 2.6 లక్షల కోట్ల వ్యయంతో నీటి పారుదల ప్రాజెక్టుల నిర్మాణం జరుగుతోంది. 46 వేల చెరువులను పునరుద్ధరించేందుకు కాకతీయ మిషన్ ను తీసుకొచ్చారు. లోటు నుంచి మిగులు వైపు విద్యుత్ రంగాన్ని నడిపించారు. పారిశ్రామికంగా చూసుకుంటే.. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో నంబర్ వన్ స్థానం తెలంగాణ దక్కించుకుంది. దరఖాస్తు చేసుకున్న 15 రోజుల్లోనే అన్ని రకాల అనుమతులూ వచ్చే విధంగా సులభమైన పారిశ్రామిక విధానాన్ని తీసుకొచ్చారు. మహిళల భద్రత కోసం షీ టీమ్స్, గ్రామీణాభివృద్ధి కోసం చేతి వృత్తులు, కులాల వారికి చేయూత, ప్రతీయేటా 40 కోట్ల మొక్కలు నాటడం… వీటితోపాటు కల్యాణ లక్ష్మీ, డబుల్ బెడ్రూమ్ ఇళ్లు లాంటి సంక్షేమ పథకాలను కూడా కేసీఆర్ సర్కారు అమలు చేస్తోంది. తెలంగాణ ఏర్పడ్డాక గడచిన నాలుగేళ్లలో పాలనలో తనదైన ముద్రను కేసీఆర్ వేశారనడంలో సందేహం లేదు.
నీళ్లు, నిధులు, నియామకాలు పునాదులపై తెలంగాణ ఉద్యమం సాగింది. కొత్త రాష్ట్రం వచ్చాక ప్రజల ఆకాంక్షలు కూడా వీటి చుట్టూనే ఉన్నాయి. అయితే, ఆశించిన స్థాయిలో ఇవేవీ ప్రజలకు ఇంకా దక్కలేదన్న విమర్శలు ప్రతిపక్షాలు చేస్తున్నాయి. రాజకీయాలను పక్కన పెడితే.. గడచిన నాలుగేళ్లలో తెలంగాణ సమగ్రాభివృద్ధికి కావాల్సిన పునాదులు పడ్డాయనే చెప్పొచ్చు. పూర్తి స్థాయిలో వాటి ప్రతిఫలాలు వచ్చేందుకు సమయం పట్టొచ్చేమోగానీ… ఒక కొత్త రాష్ట్రంగా గణనీయమైన అభివృద్ధి వైపునకు సాగే పయనం జోరందుకుందనే చెప్పొచ్చు.