సమైక్యరాష్ట్ర చివరి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సోదరుడు సంతోష్ రెడ్డి త్వరలో తెదేపాలో చేరబోతున్నట్లు వచ్చిన వార్తలను ఆయన ఖండించలేదు…సమర్ధించలేదు. అలాగే తెదేపా నేతలు ఎవరూ కూడా వాటిపై స్పందించకపోవడంతో సంతోష్ రెడ్డి తెదేపాలో చేరవచ్చనే అందరూ భావిస్తున్నారు. కానీ ప్రకారం కిరణ్ కుమార్ రెడ్డి, ఆయన సోదరులు కలిసి త్వరలోనే బీజేపీలో చేరబోతున్నట్లు తాజా సమాచారం. ఈ విషయాన్నీ వారి కుటుంబ సభ్యులు తమకు తెలియజేసినట్లు ఒక ప్రముఖ మీడియా ఛానల్ పేర్కొంది. కనుక ఈ వార్తను నమ్మవచ్చును.
కిరణ్ కుమార్ రెడ్డి రాష్ట్ర విభజన విషయంలో తన అధిష్టానాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సమయంలో అప్పటి గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ అకస్మాత్తుగా హైదరాబాద్ వచ్చి ఆయనతో సమావేశం అయినప్పుడే కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పేసి బీజేపీలో చేరి ఆంద్రప్రదేశ్ రాష్ట్ర పగ్గాలు చేపడతారని ఊహాగానాలు వచ్చేయి. ఒకవేళ ఆయన అప్పుడే కనుక బీజేపీలో చేరి ఉండి ఉంటే ఆయన రాజకీయ భవిష్యత్, రాష్ట్ర రాజకీయాలు మరో విధంగా ఉండేవేమో? కానీ అందరికీ శకునం చెప్పిన బల్లి కుడితిలో పడి చచ్చిందన్నట్లుగా, రాష్ట్ర విభజన జరిగితే రెండు తెలుగు రాష్ట్రాలు ఎటువంటి సమస్యలు ఎదుర్కోవలసి వస్తుందో చాల చక్కగా వివరించి చెప్పిన కిరణ్ కుమార్ రెడ్డి, వరుసగా తప్పుడు నిర్ణయాలు తీసుకొని తన రాజకీయ భవిష్యత్ ని తనే చేజేతులా నాశనం చేసుకొన్నారు.
ఆనాడు ఎప్పుడో తీసుకోవలసిన ఈ నిర్ణయం ఇప్పుడు తీసుకొంటున్నట్లున్నారు. వచ్చే ఎన్నికల నాటికి ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా అవతరించాలని బీజేపీ కలలు కంటోంది. కానీ రాష్ట్ర బీజేపీ నేతలకి అటువంటి గొప్పగొప్ప కలలు, ఆలోచనలున్నట్లు లేవు. వారి అనాసక్తత లేదా నిర్లిప్తత వలన అసలు రాష్ట్రంలో బీజేపీ ఉందా లేదా? అనే పరిస్థితి నెలకొని ఉంది. కనుక రాష్ట్ర బీజేపీ పగ్గాలు కిరణ్ కుమార్ రెడ్డికి అప్పగించి వచ్చే ఎన్నికలలోగా రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయమని బీజేపీ అధిష్టానం కోరుతుందో లేకపోతే ఆయన స్థాయికి తగ్గట్లుగా కేంద్రంలో కీలక పదవి అప్పగిస్తుందో వేచి చూడాలి.