తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. భారీ వర్షాల కారణంగా పలు ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. విస్తారంగా కురుస్తోన్న వర్షాలు సహాయక చర్యలపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తోన్న వర్షం కాస్త కరుణించడంతో ఇప్పుడిప్పుడే వరద ప్రభావిత ప్రాంతాలు తెరుకుంటున్నాయి.
ఈ క్రమంలోనే తెలంగాణలోని పలు జిల్లాలకు వాతావరణ శాఖ మరో బ్యాడ్ న్యూస్ చెప్పింది. నాలుగు రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. నిర్మల్ , నిజామాబాద్ , వికారాబాద్, సంగారెడ్డి, మెదక్ , కామారెడ్డి జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. ఈ ఆరు జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
వర్షాల సమయంలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని, గంటకు 40నుంచి 50 కిలో మీటర్ల వేగంతో గాలులు వీస్తాయని అధికారులు వెల్లడించారు. ఇప్పటికే భారీ వర్షాలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలు, పంట నష్టంతో నష్టపోయిన రైతులు.. మరో నాలుగు రోజులపాటు భారీ వర్షాలు ఉన్నాయని హెచ్చరికలతో తీవ్ర ఆందోళనకు గురి అవుతున్నారు.