హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ మాత్రమే కాదు శంషాబాద్ దగ్గర మరో నగర నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. తెలంగాణ ప్రభుత్వం శంషాబాద్ సమీపంలోని ముచ్చర్ల గ్రామం వద్ద అంతర్జాతీయ స్థాయిలో హెల్త్ హబ్ నిర్మించాలని నిర్ణయించిది. దీన్ని సైబరాబాద్ స్థాయిలో అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. రేవంత్ రెడ్డి తన విజన్ ను అసెంబ్లీలో ప్రకటించారు.
శంషాబాద్‌లోని ముచ్చర్ల సమీపంలో వెయ్యి ఎకరాల్లో హెల్త్ టూరిజం హబ్‌ను ఏర్పాటు చేయాలని ఇటీవలే నిర్ణయం తీసుకున్నారు. గత పదేళ్లుగా హైదరాబాద్‌లోని ఆస్పత్రులకు విదేశీ పేషెంట్ల రాక ఎక్కువగా ఉంది. ఆఫ్రికా దేశాలైన నైజీరియా, సూడాన్, మిడిలీస్ట్ దేశాలు ఒమన్, ఇరాక్, యెమన్ అలాగే బంగ్లాదేశ్, నేపాల్, ఆఫ్ఘన్ నుంచి కూడా రోగులు హైదరాబాద్ ఆస్పత్రులకు వస్తున్నారు. సంపన్న దేశాలైన అమెరికా, కెనడా, బ్రిటన్, రష్యా, ఆస్ట్రేలియా, చైనా వంటి దేశాల నుంచి కూడా మన భాగ్యనగరానికి వస్తున్నారు. తక్కువ ఖర్చుతో మెరుగైన వైద్యం లభిస్తూండటమే కారణం.
కొన్నాళ్ల కిందటి ఇక్కడ నుంచి వైద్య సేవల కోసం కొంత మంది అమెరికాకు వెళ్లేవాళ్లు కానీ ఇప్పుడు అమెరికా, ఆఫ్రికా, గల్ఫ్ దేశాల నుంచి ట్రీట్మెంట్ కోసం వస్తున్నారు. ఇక పొరుగు దేశాల నుంచి వచ్చే వారి సంఖ్య లక్షల్లోనే ఉంటోంది. తక్కువ ఖర్చులో వీలైనంత మెరుగైన వైద్య సేవలు అందించడంలో హైదరాబాద్ ప్రపంచ గుర్తింపును పొందుతోందని ప్రభుత్వం చెబుతోంది. శంషాబాద్‌లోని ముచ్చర్ల వద్ద ఇప్పటికే భూసేకరణ ప్రక్రియ జరుగుతోంది. అయితే గతంలో ఫార్మా సిటీకి భూసేకరణ నోటిఫికేషన్ ఇచ్చిన సమయంలో రైతులు ముందుకు రాలేదు. రైతులకు మేలు జరిగేలా… సైబరాబాద్ తరహాలో హెల్ సిటీ నిర్మిస్తారు కాబట్టి ..ఈ సారి ముందుకు వస్తారని భావిస్తున్నారు.
మెడికల్ రంగంలో హైదరాబాద్ కు ఉన్న అడ్వాంటేజ్ ను ఉపయోగించుకుని ప్రత్యేకంగా ఆరోగ్య రంగంలోని అన్ని విభాగాలతో ఓ సిటీని నిర్మించాలనుకోవడం సరికొత్త ఆలోచన అని మౌలిక సదుపాయాల రంగ ప్రముఖులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మాటల్లోనే కాకుండా రేవంత్ చేతల్లో చూపిస్తే.. శంషాబాద్ వైపు..మరో వరల్డ్ క్లాస్ సిటీ రూపుదిద్దుకునే అవకాశం ఉంది.