భాజపా ఎంపీ హరిబాబు ప్రెస్ మీట్ పెట్టారు. ఆయన ఎన్నిసార్లు మాట్లాడినా ఒకటే కంటెంట్ ఉంటుంది. ఆంధ్రాకి కేంద్రం అన్నీ ఇచ్చేసిందనీ, స్వతంత్రం వచ్చిన తరువాత ఏ కేంద్ర ప్రభుత్వమూ ఏ రాష్ట్రానికీ ఇంత ఇవ్వలేదనంటారు! పోనీ, ఇప్పటి వరకూ ఇచ్చింది ఏంటనేదైనా స్పష్టంగా చెప్పగలుగుతారా అంటే.. అదీ ఉండదు! గతంలో ఎన్నడూ లేని విధంగా ఏపీలో కొన్ని జాతీయ విద్యా సంస్థలను ప్రారంభించామని మాత్రమే చెబుతారు. వాటికి బడ్జెట్లో కేటాయించిన నిధుల గురించి మాత్రం మాట్లాడరు. ప్రత్యేక ప్యాకేజీ, రైల్వే జోన్, కడప ఉక్కు పరిశ్రమ… ఇలాంటివి కేంద్రం పరిశీలనలో ఉన్నాయనీ, రేపోమాపో సానుకూల నిర్ణయం తీసుకుంటారని చెబుతారు. అయితే, తాజా ప్రెస్ మీట్ లో ఆయన ప్రత్యేక ప్యాకేజీ గురించి మాట్లాడారు.
‘ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్ కి ఇస్తామని హామీ ఇచ్చాం కాబట్టి, రాష్ట్ర రెవెన్యూ లోటును పూడుస్తూ, అదనంగా ఐదు సంవత్సరాలపాటు ప్రత్యేక హోదా వల్ల కలిగే ఆర్థిక ప్రయోజనాన్ని ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది’ అన్నారు. ప్రత్యేక హోదాకు బదులు ఇచ్చిన ప్యాకేజీ రాష్ట్రానికి ఉపయోపడుతుందని టీడీపీ నమ్మిన తరువాత కూడా, రాజకీయ కారణాలతో, రాజకీయ ప్రయోజనాల కోసం ఇప్పుడు మాట మార్చిందన్నారు. మరో ఏడాదిలో రాబోతున్న ఎన్నికల్లో లబ్ధి కోసమే ఏపీకి ఏదో అన్యాయం జరిగిపోతుందని అంటున్నారని ఆరోపించారు. టీడీపీ నేతల వాదనల్లో వాస్తవాలు లేవని స్పష్టం చేస్తున్నా అన్నారు.
ఐదేళ్లపాటు ప్యాకేజీ ద్వారా ఆర్థిక ప్రయోజనాలు ఇచ్చేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని, ఆ మాట నాలుగేళ్ల తరువాత హరిబాబు చెప్పడం విడ్డూరంగా ఉంది. ఇప్పటికీ కేంద్రం సిద్ధంగా ఉందని చెబుతున్నారే తప్ప… ఆ సంసిద్ధత ఏమిటీ ఎలా అనే స్పష్టత ఇవ్వలేకపోతున్నారు. ఆ ఐదేళ్ల ప్రయోజనాలను ఎక్కడి నుంచీ లెక్కిస్తారనేది కూడా చెప్పడం లేదు. ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించిన మర్నాడే ఈ ఇవ్వడాలేవో మొదలవ్వాలి కదా! అప్పుడు కాదని.. ఇప్పుడు అవునని ఎందుకంటున్నారు..? ప్యాకేజీ ప్రకటించేసి, రెండేళ్లపాటు ఒక్క రూపాయి కూడా విదల్చకుండా.. ఇప్పుడు టీడీపీ పోరాటానికి దిగిందని చెప్పి, ఐదేళ్లూ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామంటున్నారు. ఏడాదిలో రాబోయే ఎన్నికల ప్రయోజనాల కోసమే టీడీపీ విమర్శలు చేస్తోందని అంటున్నారు! ప్రకటించిన ప్యాకేజీ ఉన్నది ఉన్నట్టుగా అమలు చేసి ఉంటే.. ఇప్పుడీ సమస్యలు ఉండేవి కాదు కదా! నిజానికి, ప్రత్యేక హోదా ఊసు కూడా చర్చకు వచ్చేది కాదు.