భారత ఆహార భద్రతా, ప్రమాణాల ప్రాధికార సంస్థ పెరుగులో ప్రమాణాలు ఎలా ఉన్నాయో చూడాలి కానీ పెరుగు పేరును ఏ భాషలో పలకాలన్నది డిసైడ్ చేస్తే…. జరిగే పరిమాణాలు వేరుగా ఉంటాయి. ఆ విషయం మరోసారి అనుభవ పూర్వకమయింది. తమిళనాడులో అమ్మే పెరుగు ప్యాకెట్లలో ఇంగ్లిష్లో కర్డ్ అని.. తమిళంలో తయిర్ అని ఉంటుంది. ఆ రెండింటినీ తీసేసి దహీ అనే పదం వాడాలని ఆదేశాలిచ్చింది. పెరుగును హిందీలో దహీ అంటారు.
ఇలా ఆదేశాలు బయటకు వచ్చిన మరుక్షణం తమిళనాడు భగ్గు మంది. వారూ వీరు అని కాకుండా అందరూ భగ్గుమన్నారు. చివరికి బీజేపీ తమిళనాడు అధ్యక్షుడు కూడా మాట కలపక తప్పలేదు. హిందీని బలవంతంగా రుద్దే ఉద్దేశంతోనే ఇలాంటి ఉత్తర్వులు ఇస్తున్నారని మండిపడ్డారు. ఇలా చేస్తే కేంద్రాన్ని దక్షిణాది శాశ్వతంగా బహిష్కరిస్తుందని మండిపడ్డారు. ఈ ఉద్యమం బీజేపీని కేంద్రాన్ని దహించేసే పరిస్థితి ఏర్పడటంతో.. వెంటనే ఎఫ్ఎస్ఏఏఐ వెనక్కి తగ్గింది. పెరుగు ప్యాకెట్లతో ఇంగ్లిష్తో పాటు స్థానిక భాషల పేర్లు పెట్టుకోవచ్చని సూచించింది. ఉత్తర్వులు సవరించింది.
తమిళనాడు ప్రజల మాతృభాషను కాపాడుకోవడానికి దేనికైనా తెగిస్తారు. ఆ స్ఫూర్తి ఇతర రాష్ట్రాల్లో కనిపించడం లేదు. అలాంటి ఆదేశాలే ఏపీ, కర్ణాటకకు కూడా వచ్చి ఉంటాయని భావిస్తున్నారు. ఏపీలో ప్రభుత్వం అసలు తెలుగు మీడియంను ఎత్తేస్తున్నా ఒక్కరూ నో రెత్తలేదు. అంతేనా.. తెలుగును ఓ కులానికి అంటగట్టే ప్రయత్నం చేసినా కిక్కురుమనలేదు. కానీ తమిళులు మాత్రం ఈ విషయంలో ప్రత్యేకమైన వాళ్లే.