రెండు రోజుల పాటు ఢిల్లీలో జీ 20 సమావేశాలు జరిగాయని తెలుగు రాష్ట్రాల్లో ఎవరికైనా తెలుసా ?. సోషల్ మీడియా, మీడియా ద్వారా వార్తలు తెలుసుకునే ఎవరికీ తెలియదు. ఎందుకంటే జీ 20 వార్తలు ఎవరికీ కనిపించలేదు. ప్రధాని మోడీ .. ఇండియాలో అడుగు పెట్టారన్న సంగతి తెలిసింది కానీ తర్వాత ఏం చేశారో… ప్రధానితో ఏం మాట్లాడారు.. దేశానికి ఏం గుడ్ న్యూస్ చెప్పారు… మనోళ్లకు గ్రీన్ కార్డులు పెంచుతారన్నారా లాంటి కబుర్లు ఎక్కడా కనిపించలేదు. ఆయన వెళ్లిపోయిన విషయాన్నీ పట్టించుకోలేదు. అమెరికా అధ్యక్షుడ్నే పట్టించుకోలేదంటే.. ఇక నలభై దేశాల అధ్యక్షులు వచ్చారని తెలుస్తుందా ?
ఎప్పుడైనా అమెరికా అధ్యక్షుడుఇండియాకు వస్తున్నాడంటే… ఆయన విమానం దగ్గర్నుంచి తినడానికి వాడే స్పూన్ గురించి కూడా కథలు కథలుగా చెప్పేవారు. ఇప్పుడు ఆయననే పట్టించుకోలేదు. కేంద్రం జీ 20 సమావేశాలకు ఆతిధ్యం ఇవ్వడంపై ఏడాది నుంచి ప్రచారం చేస్తోంది. ప్రపంచంలో తమ దేశాన్ని గొప్పగా నిలబెట్టామని. .. నాయకత్వం వహిస్తున్నామని చెప్పాలనుకుంది. కానీ అసలు ఆ నాయకత్వం గురించి ప్రజలకు తెలియాల్సిన అవసరం లేకుండా పోయింది. జీ 20లో అసలేం జరిగిందో ఎవరికీ తెలియదు. చెబుతామన్నా ఎవరూ పట్టించుకోలేదు.
మూడు రోజుల నుంచి చంద్రబాబు… చంద్రబాబు అని నిమిషం ఉచ్చరించని టీవీ చానల్ లేదు. ఎవరి అజెండా వారిది. అయితే అందరూ తమ వ్యూయర్స్ ను సంతృప్తి పరిచారు. ఎవరి అజెంండా మేరకు వారు వార్తలిచ్చారు. అయితే ఆ అజెండాలో జీ 20 లేకపోవడమే మహా విషాదం. దీనికి మీడియా చెప్పే కారణాలు ఉంటాయి.. ప్రజలు ఏది చూస్తే దాన్నే చూపిస్తామని. అది కూడా నిజమే కావొచ్చు.. చంద్రబాబు మారథాన్ ఎపిసోడ్ కాకుండా.. జీ 20 చూపిస్తే ప్రజలు ఎవరైనా చూసేవాళ్లా ? చానల్ మార్చేసేవాళ్లు. అందుకే ఎవరిదీ తప్పు కాదు….