తెలంగాణలో ఫలితాలు వచ్చిన తర్వాత కూడా మంత్రుల కార్యాలయాల నుంచి కీలక ఫైళ్లు వాహనాల్లో తీసుకెళ్లిన విషయం గగ్గోలు రేగింది. ఏపీలో అలాంటి పరిస్థితులు ఏర్పడకుండా అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటుంది. జూన్ 4న కౌంటింగ్ జరగనున్న వేళ ఏపీ సాధారణ పరిపాలన శాఖ మంత్రుల పేషీలకు సంబంధించి కీలక ఆదేశాలు జారీ చేసింది. జూన్ 3న మంత్రుల పేషీలు, ఛాంబర్లు స్వాధీనం చేసుకుంటామని ప్రకటించారు. ఈ మేరకు మంత్రుల కార్యాలయ సిబ్బందికి ఆదేశాలిచ్చింది.
ఇక నుంచి సచివాలయం నుంచి తమ అనుమతి లేకుండా ఎలాంటి పత్రాలు, వస్తువులు తీసుకెళ్లొద్దని స్పష్టం చేసింది. ప్రత్యేకంగా మంత్రుల పేషీలు, ప్రభుత్వ శాఖల్లోని దస్త్రాలు, కాగితాలు తరలించేందుకు వీల్లేదని ఆదేశాల్లో పేర్కొంది. ఈ క్రమంలో వాహన తనిఖీలు చేయాలని సచివాలయ భద్రతను పర్యవేక్షించే ఎస్పీఎఫ్ సిబ్బందికి నిర్దేశించింది. జూన్ 3లోగా మంత్రుల పేషీలకు తాళాలు వేస్తామని.. సూచించింది. జూన్ 4న ఫలితాల అనంతరం కొత్త ప్రభుత్వం కొలువు దీరనుండడంతో స్వాధీన ప్రక్రియను జీఏడీ ప్రారంభించింది.
ప్రస్తుత వైసీపీ ప్రభుత్వంలో అన్ని నిర్ణయాలు ఇష్టారాజ్యంగా సాగిపోయాయన్న ఆరోపణలు ఉన్నాయి. చివరికి సీఎం రిలీఫ్ ఫండ్ విషయంలోనూ ఎన్నో ఆరోపణలు ఉన్నాయి. ఓ సారి చెక్కులు కోల్ కతాలో డ్రా చేసుకోబోయారు. ఆ కేసు ఏమయిందో కూడా తెలియదు. ఇలాంటి ఫైల్స్ అన్నీ మాయం చేసే ప్రమాదం ఉందన్న అంచనాలు ఉన్నాయి. అందుకే తర్వాత విమర్శలు రాకుండా ముందుగానే అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయితే.. జాగ్రత్తపడేవారు ఇంత కాలం సైలెంట్ గా ఉంటారా.. ఇప్పటికే సర్దుబాటు చేసుకుని ఉంటారన్న సెటైర్లు కూడా వినిపిస్తున్నాయి.