ఎన్నికలకు ముందు వచ్చిన యాత్ర సినిమాను జనం చూడకపోయినా ధియేటర్లను రెంట్ కు తీసుకుని మరీ షోలు వేశారు వైసీపీ నాయకులు. ఉచితంగా జనాన్ని తరలించి సినిమా చూపించారు. ఇలా షోలు వేయించిన వారిలో ఒకరు పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గం బెల్లంకొండకుచెందిన జడ్పీటీసీ గాదె వెంకటరెడ్డి. నిజానికి ఆయనకు ఈ పదవి ఈ యాత్ర ప్రదర్శన తర్వాత జరిగిన ఎన్నికల్లో వైసీపీ గెలిచిన తర్వాత వచ్చింది. ఈ సినిమాను చూసే వాళ్లు ఎవరూ లేకపోయినా.. తన భార్య బంగారం తాకట్టు పెట్టి..వారం రోజులు ధియేటర్ ను రెంట్ కు తీసుకుని ఆడించానంటున్నారు. ఇప్పుడీ విషయం ఎందుకు చెబుతున్నారంటే.. అంత త్యాగం చేసినా ఇప్పుడు తనను నమ్ముకున్న ప్రజలకు న్యాయం చేయలేకపోతున్నారట.
వైసీపీ అధికారంలోకి రావడానికి ఎన్నికల సమయంలో రూ. కోటికి పైగా ఖర్చు పెట్టానన్నారు. పార్టీ అధికారంలోకి వచ్చాక బెల్లంకొండ మండలం జడ్పీటీసీగా గెలిచానన్నారు. పార్టీ కోసం తనకున్న 70 ఎకరాలకు పైగా అమ్మానన్నారు. ఈ నాలుగేళ్ళల్లో తన సొంత సమస్యలే పరిష్కారం చేసుకోలేకపోయానని ఆవేదన వ్యక్తం చేశారు. తనను నమ్మి గెలిపించిన ప్రజల సమస్యలను ఎలా తీర్చాలన్నారు. అధికారులకు ఎన్ని సార్లు చెబుతున్నా పట్టించుకోవడంలేదని, సమస్యలు తీరలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీకి ద్రోహం చేసిన వారిని ఎమ్మెల్యే నంబూరు శంకరరావు ప్రోత్సహిస్తున్నారని గాదె వెంకటరెడ్డి మండిపడుతున్నారు.
నిజానికి గాదె వెంకటరెడ్డి జడ్పీటీసీగా గెలవక ముందే తెలుగుదేశం పార్టీలో చేరాలనుకున్నారు. నామినేషన్లు వేసిన తర్వాత కరోనా కారణంగా ఎన్నికలు ఆలస్యమయ్యాయి. ఈ మధ్యలో ఎమ్మెల్యే తీరు ఆయనకు నచ్చకపోవడంతో అభ్యర్థిత్వం ఉపసంహరించుకుని టీడీపీలో చేరాలనుకున్నారు. అయితే అప్పట్లో ఆయన ప్రయత్నాన్ని వైఎస్ఆర్సీపీ నేతలు ఎలాగోలా అడ్డుకున్నారు. టీడీపీలో చేరేందుకు వెళ్తున్న ఆయనను హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు వద్ద అడ్డుకుని వైసీపీ నేతలు వెనక్కి తీసుకెళ్లిపోయారు. ఇప్పుడు మరోసారి వాయిస్ వినపిస్తున్నారు.