తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యురాలి పదవికి గల్లా అరుణ కుమారి రాజీనామా చేశారు. లేఖను చంద్రబాబుకు పంపారు. వ్యక్తిగత కారణాల వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలిపారు. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో సంస్థాగత ఎన్నికల సందడి నెలకొంది. పార్టీ పదవులను చంద్రబాబు భర్తీ చేస్తున్నారు. ఇప్పటికే పార్లమెంటరీ నియోజకవర్గాల వారీగా అధ్యక్షులను ప్రకటించారు. రాష్ట్రకమిటీని ప్రకటించడానికి ముహుర్తం సిద్ధం చేసుకున్నారు. రెండు రోజుల్లో అచ్చెన్నాయుడును రాష్ట్ర అధ్యక్షుడిగా ప్రకటించనున్నట్లుగా చెబుతున్నారు.
ఈ సమయంలో పొలిట్ బ్యూరో సభ్యత్వానికి గల్లా అరుణ కుమారి రాజీనామా చేయడం ఆసక్తికరంగా మారింది. అయితే….పార్టీలో అన్ని వ్యవస్థను ప్రక్షాళన చేసి.. యువతరానికి ప్రాధాన్యం ఇస్తున్న క్రమంలో… గల్లా అరుణకుమారికి ఈ సారి పొలిట్ బ్యూరోలో చోటు దక్కడం కష్టమని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. ముందుగానే గౌరవంగా ఆమె రాజీనామా చేసినట్లుగా చెబుతున్నారు. గల్లా అరుణకుమారి ప్రత్యక్ష రాజకీయాలకు కొంత కాలంగా దూరంగా ఉంటున్నారు.
2014 ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన తర్వాత ఆమె రాజకీయాల్లో యాక్టివ్గా లేరు. ఆమె కుమారుడు గల్లా జయదేవ్ గుంటూరు ఎంపీగా రెండో సారి గెలిచారు. 2019ఎన్నికల్లో గల్లా అరుణకుమారి పోటీ చేయలేదు. పొలిట్ బ్యూరో సభ్యత్వం విషయంలో గల్లా రాజీనామా సాధారణ విషయమేనని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. గల్లా జయదేవ్ పార్టీలో కీలకంగా ఉంటున్నారు. ఆయన అమరావతి రైతుల కోసం శక్తివంచన లేకుండా శ్రమిస్తున్నారు. తన వ్యాపార సంస్థలపై ప్రభుత్వం వేధింపులకు పాల్పడుతున్నా వెనక్కి తగ్గడం లేదు. ఈ క్రమంలో గల్లా అరుణ రాజీనామా వ్యక్తిగతమేనని టీడీపీ వర్గాలంటున్నాయి.