సినిమాలు రెండు రకాలు. ఒకటి.. జీవితాన్ని దాటొచ్చి, జీవితంలో కనిపించనివీ, వినిపించనవీ.. చూపించే సినిమాలు. దాన్ని.. లార్జన్ దెన్ లైఫ్ సినిమాలూ అంటుంటారు. ఇంకోటి.. జీవితంలోని పొరల్లోకి చొచ్చుకెళ్లిపోయి… జీవితంలోని ఘర్షణకు అద్దం పట్టే సినిమాలు. ఏ సినిమాలో అయినా.. ప్రేక్షకుడ్ని కనెక్ట్ చేయగలిగే పాయింట్ ఉండడమే… ప్రధానం. `గమనం` జీవితాల కథ. మూడు జీవితాలతో ముడిపడిన కథ. మరి ఆ కథలు మన జీవితాలకు ఎంత దగ్గరగా ఉన్నాయి? ఏ కథకు ఎక్కువ కనెక్ట్ అవుతాం?
కమల (శ్రియ) ఓ బస్తీలో జీవిస్తుంటుంది. తనకు వినపడదు. నెలల పాప. ఓ షావుకారు దగ్గర బట్టలు కుట్టుకుంటూ.. జీవినం సాగిస్తుంటుంది. భర్త.. దుబాయ్ లో ఉంటాడు. తన రాక కోసం ఎదురు చూస్తుంటుంది. అలీ (శివ కందుకూరి) కి క్రికెట్ అంటే ప్రాణం. ఎప్పటికైనా జాతీయ జట్టులో ఆడాలనుకుంటాడు. నాన్న (చారు హాసన్) పద్ధతి తెలిసిన మనిషి. పరువు, ప్రతిష్టలకు ప్రాణం ఇస్తాడు.
మరోవైపు.. ఇద్దరు వీధిబాలల కథ. వాళ్లేమో అనాథలు. కనీసం పుట్టిన రోజంటే ఏమిటో కూడా తెలీదు. కేకు కొనుక్కుని పుట్టిన రోజు చేసుకోవాలనుకుంటారు. అందుకోసం రూ.500 కావాలి. ఈ ముగ్గురి కథ.. ఓ వర్షం పడిన రోజు ఎలా చెల్లాచెదురయ్యింది..? దానికి కారణం ఏమిటి? అనేది తెలియాలంటే గమనం చూడాలి.
గమనం అనే టైటిల్, పోస్టర్లు, ప్రచార చిత్రాలూ చూసి.. ఇది పక్కా కమర్షియల్ హంగులతో సాగే సినిమా అని ఎవరూ అనుకోరు. ఏదో చెప్పాలనే ప్రయత్నం ఉంటుంది. కాస్త స్లోగా అయినా సరే, భరిద్దాం అనుకునే థియేటర్లలోకి ఎంట్రీ ఇస్తారు. వాళ్లు ప్రిపేర్ అయి రావడం.. ఈ సినిమాకి ఓ ప్లస్ పాయింట్. అలాగని దాన్ని అడ్వాంటేజ్ గా మాత్రం తీసుకోకూడదు. గమనం టీమ్ అదే చేసిందనిపిస్తుంది. మూడు పాత్రలు.. మూడు కథలు సమాంతరంగా సాగుతాయి. ఒకదాని తరవాత మరోటి. మూడూ వేరు వేరు కథలైనా, చివర్లో ఎక్కడో ముడి వేస్తారనిపిస్తుంది. అది జరగదు.అలాంటప్పుడు మూడు కథలు చెప్పినా ఒక్కటే.. ముఫ్ఫై మూడు కథలు చెప్పినా ఒక్కటే. పెద్ద తేడా ఉండదు. ప్రతీ కథా.. స్లో మోషన్లోనే నడుస్తుంది. కమల జీవితం.. పాపతో పడే ఇబ్బందులు, దుబాయ్ లోని భర్త రాకకోసం ఎదురు చూడడాలూ.. ఇవన్నీ తెలుగు ప్రేక్షకులకు అలవాటైన సినిమా కష్టాలే. దుబాయ్ లోని భర్త.. చచ్చినా రాడు.. అని ప్రేక్షకుడు కూడా ముందే ఫిక్సయిపోతాడు. కాబట్టి.. కమల ఎపిసోడ్ లో.. ఇంట్రస్టింగ్ ఎలిమెంట్స్ అంటూ లేకుండా పోయాయి.
వీధిబాలల కథకొద్దాం. ఆ ఎపిసోడ్ డాక్యుమెంటరీలా అనిపిస్తుంది. చెత్త ఏరుకోవడం, అమ్ముకోవడం… పుట్టిన రోజు కోసం ఆరాటపడడం.. ఎక్కడా ఎమోషనల్ కనెక్టివిటీ ఉండదు. అలీ క్రికెటర్‌గా ఎదగాలనుకోవడం కూడా అలాంటిదే. అలీ ఇంట్లో గొడవ పడి వెళ్లిపోయినప్పుడు… ప్రేక్షకుడి మనసు కూడా చివుక్కుమనాలి. అలా జరగలేదంటే.. ఆ కథతో పాత్రతో కనెక్ట్ అవ్వలేదనే అర్థం. కనీసం తొలి సగంలో అయినా ఈ మూడు కథలూ ఒక చోట కనెక్ట్ అవ్వాల్సింది. అలా జరగలేదు. చివరి వరకూ అదే తంతు. హైదరాబాద్ లో భారీ వర్షాలు. అప్పుడు కమల పడే అవస్థలూ చూపించడానికి 30 నిమిషాల స్క్రీన్ టైమ్ తినేశారు. అంతా చేసి చెప్పింది ఏమైనా ఉందా అంటే అదీ లేదు.
చెరువులు ఆక్రమించి, బిల్డింగులు కట్టుకుంటుంటే, బిల్డింగుల్ని చెరువుల్ని ఆక్రమించుకుంటున్నాయి. ఇదీ… ఈ కథలో చెప్పాలనుకున్న సారాంశం. కమల కథలో ఆ బాధ ఉంటుంది. కానీ మిగిలిన రెండు కథలకూ, ఈ చెరువులు అనే పాయింట్ కి ఏంటి సంబంధం? అలీ పాత్రని విషాదాతం చేశారు.అప్పుడు కూడా ఆ పాత్రతో ప్రేక్షకుడు ఎమోషన్‌గా కనెక్ట్ అవ్వలేదు. వర్షం ఆగిపోయాక… కమల జీవితం ఏమీ మారలేదు. వీధి బాలల బతుకులోనూ ఎలాంటి మర్పూ రాలేదు. అలాంటప్పుడు ఈ కథ చెప్పడంలో దర్శకురాలి ఆంతర్యం ఏమిటి? ఇది అవార్డుల కోసమే తీసిన సినిమాలానూ అనిపించదు. సినిమా స్లోగా ఉంటే అవార్డులు రావు. బలమైన కథ, కదిలించే ఎమోషన్లు ఉన్నప్పుడు.. అవార్డులే కాదు, వసూళ్లూ వస్తాయి. అవి లేక.. ఈ రెండింటికీ గమనం దూరమైనట్టు కనిపించింది.
శ్రియ ఉంది కాబట్టి.. కమల పాత్రపై ఫోకస్పడింది. కాకపోతే.. శ్రియ మాత్రమే చేయదగిన పాత్ర అనిపించదు. శివ కందుకూరి కూడా ప్రొఫెషనల్ క్రికెటర్ గా మెప్పించలేకపోయాడు. ప్రియాంక జవాల్కర్ కొన్ని ఫ్రేముల్లో మాత్రమే బాగుంది. చారుహాసన్ ని చాలాకాలం తరవాత తెలుగు తెరపై చూడడం నచ్చుతుంది. నిత్య గెస్ట్ రోల్ లో కనిపిస్తుంది. అదీ ఓ కీర్తనలో.
ఈమాత్రం కథకి ఇళయరాజా అవసరమా? అనిపిస్తుంది. ఆయన పాటలు కూడా ఈ కథ గమనాన్ని మార్చలేవు. కాబట్టి.. ఇళయరాజా కూడా పెద్దగా కష్టపడలేదు. బుర్రా సాయిమాధవ్ దగ్గర్నుంచి బలమైన సంభాషణలు ఆశించడంలో తప్పులేదు. ఆయనా తన పెన్నుకీ, అందుకున్న పారితోషికానికీ న్యాయం చేయలేదు. బహుశా.. కథ ఆయన్ని మోటివేట్ చేయలేదేమో. ఓ చోట 30 అంతస్థుల భవనం చూసిన ఓ బాల కార్మికుడు… `ఇంత పెద్ద ఇల్లు కట్టారంటే.. ఎంత చెత్త ఏరుకున్నాడో` అంటాడు. అక్కడే బుర్రా కనిపించాడు. జ్ఞానశేఖర్ కెమెరా వర్క్ బాగుంది. ఆయనే ఈ సినిమాకి నిర్మాత కాబట్టి.. ఇంకాస్త శ్రద్ధతో పనిచేశారు.
ఫినిషింగ్ టచ్: మంద గమనం