Gangs of Godavari movie review
తెలుగు360 రేటింగ్ 2/5
-అన్వర్
‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ గురించి చాలా మాట్లాడేసింది చిత్రబృందం.
‘ఇదో ఇంటెన్స్ ఉన్న కథ’ అన్నారు దర్శకుడు.
‘ఈ సినిమా చూశాక, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరికి ముందు విశ్వక్సేన్… గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి తరవాత విశ్వక్సేన్ అంటారంతా’ అని నిర్మాత చెప్పారు.
‘ఈమధ్య కాలంలో ఇలాంటి సినిమా నేనెప్పుడూ చూడలేద’న్నారు విశ్వక్సేన్.
మరి నిజంగానే ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’లో అంత ఇంటెన్సిటీ ఉందా? విశ్వక్‌లోని కొత్త నటుడు ఈ సినిమాతో బయటకు వచ్చాడా? ఇది ఇది వరకెప్పుడూ చూడని సినిమానా?
కథలోకి వెళ్దాం. అది గోదావరిలోని లంక గ్రామం. అక్కడ లంకల రత్నాకర్ (విశ్వక్సేన్) చిన్న చిన్న దొంగతనాలు చేస్తుంటాడు. జీవితంలో ఎదగాలని ఆశ పడుతుంటాడు. అందుకోసం ఎవర్నయినా బురిడీ కొట్టించడానికి రెడీ. ఆ ఏరియాలో నానాజీ (నాజర్), దొరస్వామి రాజు (గోపరాజు రమణ) ఇద్దరూ ఆధిపత్యానికి పోటీ పడుతుంటారు. దొరస్వామి రాజు స్థానిక ఎమ్.ఎల్.ఏ. ఆయన పంచన చేరతాడు రత్న. క్రమంగా ఆ గ్యాంగ్ లో కీలకమైన సభ్యుడిగా మారి, ఆ గ్యాంగ్‌కే లీడర్ అవుతాడు. ఆ తరవాత దొరస్వామితో పోటీకి దిగి ఎమ్.ఎల్.ఏ పీఠం ఎక్కుతాడు. ఆ క్రమం ఎలా సాగింది? ఎం.ఎల్.ఏ అయిన తరవాత రత్న తన స్వభావాన్ని మార్చుకొన్నాడా, లేదా? నానాజీ కూతురు బుజ్జి (నేహా శెట్టి)తో రత్న ప్రేమలో ఎలా పడ్డాడు? ఈ రత్నకూ మరో రత్న (అంజలి)కీ ఉన్న అనుబంధం ఏమిటి? ఇదంతా మిగిలిన కథ.
అండర్డాగ్ కథ ఎన్నిసార్లు చెప్పినా, ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టదు. ఓ అనామకుడు అంచెలంచెలుగా పైస్థాయికి ఎదగడం ఆసక్తి కలిగించే అంశమే. ఇటీవలే ‘పుష్ష’లో ఈ పాయింట్ టచ్ చేశాడు సుకుమార్. ఆ సినిమా ఓ మైల్ స్టోన్‌గా మారిపోయింది. ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ మూల కథలోనూ అలాంటి పాయింటే ఉంది. వేశ్య దగ్గరే డబ్బులు కాజేసి, పారిపోయే హీరో – అదే ప్రాంతానికి ఎమ్.ఎల్.ఏగా ఎలా అయ్యాడు? వందల కోట్లు ఎలా సంపాదించాడు? అనేది ఈ కథకు బీజం. అయితే ఆ ఎదిగే క్రమం అంత ఇంపాక్ట్ గా అనిపించదు. రత్న దొరస్వామి రాజు దగ్గర చేరడం, ఆ గ్యాంగ్‌లో కీలకంగా మారడం, క్రమంగా ఎమ్.ఎల్. ఏ అవ్వడం ఆర్గానిక్‌గా అస్సలు అనిపించదు.
రత్న అనేవాడు హీరో కాబట్టి, అతనేం చేసినా చెల్లుతుందిలే అన్నట్టుగానే సీన్లు డిజైన్ చేసుకొంటూ వెళ్లిపోయాడు దర్శకుడు. ‘పుష్ష’లో హీరో ఎదిగే క్రమం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఆ ప్రయాణంలో హీరో తాలుకూ ఆటిట్యూడ్, తెలివితేటలు, ధైర్యం ఇవన్నీ బయటపడతాయి. ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ రత్నలో అవేం ఉండవు. అది ఈ సినిమాకున్న ప్రధానమైన మైనస్. దొరస్వామి, నానాజీ.. ఇవి రెండూ ఈ కథలో బలమైన పాత్రలుగా అనిపిస్తాయి. అయితే రత్నని ఎలివేట్ చేసే క్రమంలో ఈ పాత్రల ప్రాధాన్యత తగ్గుతూ వెళ్తుంది. నానాజీ పాత్రనైతే మధ్యలోనే ముగించేశారు. నిజానికి దొరస్వామి చాలా పవర్ఫుల్ పాత్ర. కిడ్నాప్ డ్రామాలో ఆ పాత్రని కమెడియన్ని చేసి ఆడుకోవడం వల్ల.. ఆ పాత్రకున్న ఇంపాక్ట్ పూర్తిగా తగ్గిపోయింది. దొరస్వామి కూడా రత్నని ఏం చేయలేడు అన్న ఫీలింగ్ ప్రేక్షకుల్లో కలుగుతుంది. హీరోకు ఛాలెంజ్ తగ్గిపోతే, కథాగమనంలో మజా ఏం వస్తుంది?
ఈ విషయం దర్శకుడికీ అర్థమైంది. అందుకే చిన్నదొర పాత్రలో దొరస్వామి కొడుకుని రంగ ప్రవేశం చేయించాడు. అయితే.. ఈ పాత్రదీ ఆరంభ శూరత్వమే అనిపిస్తుంది. వచ్చిన కాసేపు ఏదో హడావుడి చేస్తాడు. ఆ తరవాత ఆ పాత్ర కూడా సైలెంట్ అయిపోతుంది. బుజ్జితో లవ్ స్టోరీ ఈ కథకు కీలకం. ఎందుకంటే ఇంత మొరటు మనిషిని, స్వార్థపరుడ్ని మార్చడానికి ప్రయత్నం చేసే పాత్ర అదొక్కటే. అలాంటప్పుడు బుజ్జి లవ్ స్టోరీ చాలా ఇంపాక్టబుల్ గా ఉండాలి. ఈ ‘గోదావరి’లో అదీ లేదు. ‘పద్ధతిగా పెళ్లి చేసుకొని, నీతో పద్ధతిగా పిల్లల్ని కనాలని వుంది’ అని చెప్పిన పద్ధతైన అమ్మాయి, ఇంత పద్ధతి లేని కుర్రాడ్ని ఎందుకు ప్రేమించింది అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న.
అంజలి పాత్ర మాత్రం బాగానే డిజైన్ చేశాడు దర్శకుడు. ఆ పాత్రని కథకు కావల్సిన చోటల్లా వాడాడు. దాంతో బుజ్జి కంటే.. రత్నగా అంజలి పాత్రకే ఎక్కువ మైలేజీ వస్తుంది. ఇలాంటి కథలకు ముగింపు ఇవ్వడం కష్టం. ఎందుకంటే కత్తిపట్టినోడు, కత్తితోనే అంతం అవుతాడు. చేతిలో రక్తపు మరకలే మిగులుతాయి. ఈ కథలోనూ అదే చెప్పాలనుకొన్నాడు దర్శకుడు. అయితే రత్న స్వార్థం, పవర్ గేమ్ చెప్పాలనుకొన్న విషయాన్ని డైవర్ట్ చేశాయి. అందుకే క్లైమాక్స్ లో రత్న ఎమోషనల్ గా డైలాగులు చెబుతున్నా అవి ఇంజెక్ట్ కావు.
అలాగని ఇందులో మెచ్చుకోదగిన విషయాలేం లేవా? అంటే.. అవి కూడా ఉన్నాయి. కొన్ని సీన్లు బాగానే డిజైన్ చేశారు. ముఖ్యంగా ఎమ్.ఎల్.ఏతో రాజీకి వెళ్లిన సన్నివేశం, దొరస్వామి రాజుని ఎటాక్ చేసే సీన్.. ఇవన్నీ బాగా కుదిరాయి. ఇంట్రవెల్ లో ఫైట్ కూడా ఇంపాక్ట్ ఇచ్చింది. అందులో పోలీస్ గెటప్‌లో… విశ్వక్‌ని చూపించడం మంచి ఎలివేషన్. కిడ్నాప్ డ్రామా వల్ల, దొరస్వామి రాజు పాత్ర కాస్త తగ్గింది కానీ, అక్కడ కాస్త ఫన్ పండింది. పాటల్ని కాస్త పొదుపుగా వాడి మంచి పని చేశారు. ఐటెమ్ పాట కూడా అనవసరమే. కేవలం మాస్ కోసం పెట్టిన ఐటెమ్ లానే అనిపిస్తుంది.
విశ్వక్ వన్ మాన్ షో ఇది. తన వరకూ ఎవరూ వేలెత్తి చూపించనంత బాగా చేశాడు. గోదావరి యాసని బాగా పట్టాడు. దర్శకుడు కూడా విశ్వక్పై పెట్టిన శ్రద్ధ మిగిలిన పాత్రలపై, కథపై పెట్టలేదనిపిస్తుంది. నేహాకు ఇది డిఫరెంట్ రోల్. బాగానే చేసింది. అయితే బాగా చిక్కినట్టు అనిపిస్తుంది. అంజలి ఇంపాక్ట్ తెరపై కనిపించింది. గోపరాజు పాత్రని మరింత బాగా, పవర్ఫుల్ గా డిజైన్ చేయాల్సింది. హైపర్ ఆది ఉన్నా.. పెద్దగా పంచ్‌లు పేలలేదు. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అన్నారు కానీ ఆ హీరో గ్యాంగ్ లో ఏ ఒక్కరి పాత్ర కూడా గుర్తు పెట్టుకొనేంత స్థాయిలో లేదు.
దర్శకుడిగా ఇది వరకు చేసిన రెండు సినిమాలూ ఫ్లాప్. మరో అవకాశం వచ్చినప్పుడు కృష్ణ చైతన్య దాన్ని సద్వినియోగ పరచుకొంటాడనుకొంటారంతా. అయితే ఈ అవకాశమూ వృధా అయిపోయింది. సెటప్ వరకూ బాగానే అనుకొన్నా, దాన్ని ఇంపాక్ట్ గా చెప్పడంలో దర్శకుడు పూర్తిగా తడబడ్డాడు. ఇదంతా రైటింగ్ లో వైఫల్యమే అనుకోవాలి. నిర్మాణ పరంగా క్వాలిటీ మేకింగ్ కనిపించింది. గోదావరి తీరం అంటే పచ్చదనం అనుకొంటారు. అయితే అలాంటి షాట్ ఒక్కటి కూడా కనిపించకుండా కెమెరా వర్క్ సాగింది. బహుశా… ముందే ఓ థీమ్ ప్రకారం ఇలానే తీయాలి అనుకొని ఉంటారు. యువన్ పాటల్లో ఓ పాట హిట్. థియేటర్లోనూ ఆ పాటకే మంచి అప్లాజ్ వచ్చింది. మిగిలిన పాటలు గుర్తుండవు. ఐటెమ్ పాటలో టెంపో అస్సలు కనిపించదు. నేపథ్య సంగీతం మాత్రం బాగుంది. ఫైట్స్ బాగా డిజైన్ చేశారు.
ఓ ఇల్లు కట్టాలటే పునాదులు, ఇటుక, సిమెంట్ ఇవన్నీ అవసరం. కానీ ఇవన్నీ ఉంటే ఇల్లు అయిపోదు. వాటిని సక్రమంగా వాడుకొని, పటిష్టమైన ఇంటిని నిర్మించే పనితనం తెలిసిన మేస్త్రీ కావాలి. సినిమా కూడా అంతే. మంచి నటీనటులు, పేరున్న సాంకేతిక నిపుణులు, ఖర్చు పెట్టడానికి వెనకాడని నిర్మాత… ఇవి సరిపోవు. వాటన్నింటినీ ముందుకు నడిపించే కథ కావాలి. ఆ కథలో ఇంటెన్స్ ఉండాలి. అది లేకపోవడం వల్లే… గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, ఎడారిలో పడవ ప్రయాణంగా మిగిలిపోయింది.
తెలుగు360 రేటింగ్ 2/5
-అన్వర్