‘మాస్ కా దాస్’ అనే ట్యాగ్ లైన్‌కి తగ్గట్టుగా సినిమాలు చేసుకొంటూ వెళ్తున్నాడు విశ్వక్సేన్. తన నుంచి వస్తున్న మరో పూర్తి స్థాయి మాస్, మసాలా, పొలిటికల్ ధ్రిల్లర్… ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’. కృష్ణ చైతన్య దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ నిర్మించింది. ఈనెల 31న విడుదల అవుతోంది. ఈ సందర్భంగా ట్రైలర్ విడుదల చేశారు.
ట్రైలర్లో మాసిజం ఏరులై పారింది. కొన్ని డైలాగులు ‘రా’గా అలానే వదిలేశారు. దాంతో.. బూతులు బీప్ లు లేకుండా వినిపించేశాయి.
మనుషులు మూడు రకాల్రా.. అని మొదలెట్టి, చివర్లో ఆడ, మగ, రాజకీయ నాయకులు అంటూ మనుషుల్ని విడగొట్టారు. దాంతో.. ఈ సినిమా జోనర్ ఏంటో, ఎటువైపు సాగుతుందో ఈజీగా అర్థమైపోతోంది. తూ.గో జిల్లా అంటే పచ్చదనం, ఆప్యాయతలు, అనురాగాలు అనుకొంటారు. అక్కడ మరో కోణం కూడా దాగుందని ఈ సినిమాతో చెప్పే ప్రయత్నం చేశారు. గోదావరి జిల్లాల్లో 1980ల నాటి రాజకీయ నేపథ్యం ఈ కథలో కనిపిస్తోంది. రత్నగా… విశ్వక్సేన్ పాత్రలో పరకాయ ప్రవేశం చేసినట్టు అనిపిస్తోంది. ”నాకు తెలిందొక్కటే…మన మీదకెవడైనా వస్తే, వాడి మీద పడిపోవడమే” అనే డైలాగ్ లోనే హీరో క్యారెక్టరైజేషన్ మొత్తం దాగుంది. ‘టైగర్.. టైగర్’ అంటూ విశ్వక్ చెప్పిన డైలాగ్ కూడా మాస్‌కి నచ్చేలా ఉంది. అంజలి, నేహాశెట్టి పాత్రల్ని పూర్తి స్థాయిలో రివీల్ చేయలేదు. కాకపోతే ఈ పాత్రల్ని సైతం బలంగా తీర్చిదిద్దినట్టు అనిపిస్తోంది. యువన్ శంకర్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్, విజువల్స్ ఈ సినిమా స్థాయిని పెంచాయి. మొత్తానికి మాస్ జాతర చేయించడానికి విశ్వక్ అండ్ టీమ్ పూర్తి స్థాయిలో రెడీ అయ్యారన్న హింట్ మాత్రం ఈ ట్రైలర్ ఇచ్చేసింది.