టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఎలాగోలా వైసీపీలో చేరేందుకు సిద్దమవుతున్నారు. ఇతర టీడీపీ ఎమ్మెల్యేల్లాగా కుమారుడికి కండువా కప్పించి పార్టీలో చేరిపోవాలని ప్రణాళికలు సిద్దం చేసుకున్నారు. మీడియాకు ఆయనే లీకులిస్తున్నారో.. వైసీపీ తరపు నుంచి లీకులు వస్తున్నాయో కానీ తరచూ గంటా చేరికపై మీడియాకు సమాచారం అందుతోంది. కానీ నిజమో కాదో తెలియని పరిస్థితి. అలానే.. గురువారం కూడా ఇలాంటి వార్తలొచ్చాయి. కానీ.. శుక్రవారానికి ఉత్తరాంధ్ర వైసీపీ ఇన్చార్జ్ విజయసాయిరెడ్డి విశాఖలో వ్యతిరేక ప్రకటనలు చేశారు. వైసీపీకి కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయని ఎవరైనా రాజీనామా చేసి రావాల్సిందేనంటూ ప్రకటించారు.
ఇప్పటి వరకూ వైసీపీలో చేర్చుకున్న వారిని రాజీనామా చేయమని అడగలేదు. కాకపోతే వారి కుటుంబసభ్యులకు.. కొడుకులకో.. మరొకరికో కండువాలు కప్పి… అందరికీ తెలిసినా.. ఎవరికీ తెలియదన్నట్లుగా తాము పార్టీలో చేర్చుకోలేదన్నట్లుగా మాట్లాడుతున్నారు. గంటా కూడా తనకు అదే ఫార్ములా వర్కవుట్ అవుతుదనుకున్నారు. తన కుమారుడు .. సినిమా హీరోగా చేసి మళ్లీ కనిపించని రవితేజకు వైసీపీ కండువా కప్పించాలని అనుకున్నారు. కానీ ఇప్పుడు విజయసాయిరెడ్డి రాజీనామా చేసి రావాల్సిందేనంటూ చేసిన వ్యాఖ్యలను ఆయన వర్గాన్ని మరింత గందరగోళంలోకి నెట్టేస్తున్నాయి. గంటా చేరిక విజయసాయిరెడ్డి… మంత్రి అవంతికి ఇష్టం లేదనేది బహిరంగరహస్యం.
విజయసాయిరెడ్డి గంటాపై గతంలో తీవ్రమైన అవినీతి ఆరోపణలు చేశారు. జైలుకెళ్తారని హెచ్చరికలు కూడా చేశారు. అదే సమయంలో.. గంటా వస్తే.. పార్టీ మొత్తం గుప్పిట్లోకి తీసుకుంటాడని.. దాని వల్ల ఇతర నేతలకు ఇబ్బందికర పరిణామాలు ఎదురవుతాయన్న విశ్లేషణ కూడా ఉంది. కానీ గంటా మాత్రం… ఇప్పుడున్న పరిస్థితుల్లో వైసీపీలో చేరాలనే పట్టుదలతో ఉన్నారు. విజయసాయిరెడ్డి ద్వారా కాకుండా ఇతరుల ద్వారా తన ప్రయత్నాలు చేసుకుంటున్నారు. కానీ విజయసాయిరెడ్డికి మాత్రం ఇష్టం లేదని తాజా పరిణామాలతో తెలిసిపోతోందని అంటున్నారు.