మూడేళ్ల నుంచి బయట మాట్లాడని గంటా శ్రీనివాసరావు తొలి సారి బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి జగన్మోహన్ రెడ్డిపై విమర్శల వర్షం కురిపించారు. ఆయన తనను తాను ఇప్పటి వరకూ బలంగా చూపించుకున్నారని కానీ ఆయన అత్యంత బలహీన నాయకుడని ఇప్పుడు తేలిపోయిదన్నారు. టీడీపీ కండువాలతో టీడీపీ నేతలతో కలిసి ప్రెస్ మీట్ పెట్టిన గంటా శ్రీనివాస్ జగన్‌పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. కేబినెట్లో చోటు దక్కలేదని సీఎం దిష్టిబొమ్మను, బైక్‌లను టైర్లను కాల్చుతూ సొంత పార్టీ నేతలుఆందోళనలు చేయటం మొదటి సారి చూశానన్నారు.
సామాజిక, ప్రాంత సమతుల్యత లేని కేబినెట్ అని గంటా తేల్చేశారు. రాజధాని అని ప్రచారం చేస్తున్నారు కానీ విశాఖకు మంత్రి పదవి లేకుండా చేశారన్నారు. విజయవాడకు, తిరుపతికి అలాగే 8 జిల్లాలకు మంత్రులు లేకుండా చేశారని ఇదేం సమీకరణమని గంటా ప్రశ్నించారు. ఎన్నికలకి రెండేళ్ల ముందు మంత్రివర్గంలో బీసీలకు ప్రాధాన్యత ఇచ్చామంటే ప్రజలు ఎలా నమ్ముతారనిప్రశ్నించారు. టీడీపీకి బీసీలు ఎప్పుడూ అ౦డగా ఉంటారన్నారు.
కొన్నింటి నుంచి డైవర్ట్ చేయడం కోసం అర్జెంట్ గా ఎటువంటి కసరత్తు చేయకుండా జిల్లాల విభజన చేశారని.. దీనిపై కూడా సొంత పార్టీ నేతలు ధర్నాలు చేశారని గుర్తు చేశారు. టీడీపీలోకి పెద్ద ఎత్తున చేరికలు ఉంటాయని ఆయన చెప్పుకొచ్చారు. ఇంత కాలం గంటానే టీజీపీని వదిలి పెట్టి వెళ్తారని ప్రచారం జరిగితే.. ఇప్పుడు ఆయనే టీడీపీలోకి వలసులు ఉంటాయని చెబుతున్నారు. మొత్తంగా గంటా శ్రీనివాస్ ట్రాక్‌లోకి వచ్చారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఆయనకు చంద్రబాబు ఎంత ప్రాధాన్యం ఇస్తారనేది ఆసక్తికరంగా మారింది.