ఓట్లు చీలకూడదని పవన్ కల్యాణ్ కోరుకున్నట్లుగానే ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితం వచ్చిందని గంటా శ్రీనివాసరావు వ్యాఖ్యానించారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా చూడాలని పవన్ కల్యాణ్ చెప్పిన విషయం ఈ ఎన్నికల్లో రుజువైందని గంటా విశ్లేషించారు. రాజధాని వ్యవహారం సహా వైసీపీ చెప్పిన మాటలకు ప్రజల్లో విశ్వాసం లభించలేదన్నారు. మూడేళ్ల క్రితం దాదాపు 50 ఓటింగ్ సాధించిన వైసీపీ ఇప్పుడు 30శాతంకు పడిపోయిందన్నారు. ఈ ఒరవడి వచ్చే ఎన్నికలకు నాంది అని.. 2024లో టీడీపీదే విజయని ధీమావ్యక్తం చేశారు. ఫలితాల సందర్భంగా విశాఖలో మీడియాతో మాట్లాడారు.
గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేకత స్పష్టంగా కనిపించిందని అంటున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులను విజయపథాన నిలిపిన గ్రాడ్యుయేట్ ఓటర్లకు ధన్యవాదాలు తెలిపారు. తాము ఎక్కడా డబ్బులు, కానుకలు పంచలేదని …. ఆరునెలల ముందే అభ్యర్థి పేరును వైసీపీ ప్రకటించినా ప్రయోజనం లేకపోయిందన్నారు. తమ అభ్యర్థిని ఫిబ్రవరి ఒకటిన ప్రకటించామని అన్నారు. ఈ ఎన్నికలు ప్రభుత్వానికి చెంపపెట్టని గంటా అన్నారు. రాబోయే రోజుల్లో ఇదే ధోరణి కొనసాగుతుందన్నారు.
పవన్ కల్యాణ్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీకి మద్దతు ప్రకటించలేదు. కానీ వైసీపీకి మాత్రం ఓటు వేయవద్దని పిలుపునిచ్చారు. పొత్తులో ఉన్న బీజేపీకి కూడా ఓటు వేయమనలేదు. దీంతో పవన్ ఉద్దేశం తెలుగుదేశం అభ్యర్థుల్ని గెలిపించమనే అని.. జససైనికులు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. వారికి తగ్గట్లుగానే గంటా వ్యాఖ్యలు చేశారు. అయితే.. అసెంబ్లీ ఎన్నికల్లో ఇలాంటి ఫలితాలు రావాలంటే..జనసేనతో పొత్తు ఉంటే మంచిదని గంటా కూడా అనుకుంటున్నారు. అందుకే జనసేనకు క్రెడిట్ ఇచ్చే వ్యాఖ్యలు చేస్తున్నారని అంటున్నారు.