తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధమయింది. గతంలో చాలా సార్లు ముహుర్తం పెట్టుకున్నారు కానీ… వైసీపీ నేతల్ని బుజ్జగించడం ఆలస్యమయింది. వారం రోజుల్లోఆయన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కలవనున్నట్లుగా చెబుతున్నారు. ఇతర టీడీపీ ఎమ్మెల్యేల్లాగా.. గంటా కూడా తన కుమారుడ్ని వైసీపీలో చేర్చి తాను మాత్రం అధికారికంగా కండువా కప్పుకోరు. గతంలోనే గంటా వైసీపీలో చేరుతారనే ప్రచారం జరిగింది కానీ.. అప్పట్లో ఆగిపోయింది.
కొంత మంది నేతలు గంటాకు వ్యతిరేకంగా హైకమాండ్ వద్ద లాబీయింగ్ చేయడంతో అప్పట్లో ఆగిపోయింది. అయితే అసెంబ్లీ సమావేశాల కంటే ముందే చంద్రబాబుకు ప్రధాన ప్రతిపక్ష హోదా లేకుండా చేయాలన్న వ్యూహంతో వైసీపీ ఉన్నట్లుగా తెలుస్తోంది. కొద్ది రోజుల కిందట వాసుపల్లి గణేష్ కుమార్‌ని వైసీపీలో చేర్చుకున్నారు. దీంతో నలుగురు ఎమ్మెల్యేలు టీడీపీకి దూరం అయినట్లు అయింది. గంటాతో కలిపి ఐదుగురు పార్టీ మారినట్లు అవుతుంది. టీడీపీకి పద్దెనిమిది ఎమ్మెల్యేలు మాత్రమే మిగులుతారు.
వైసీపీ ఉత్తరాంద్ర ఇన్చార్జ్గా ఉన్న విజయసాయిరెడ్డి గతంలో గంటా సైకిళ్ల స్కామ్‌కు పాల్పడ్డారని ఆరోపించారు. త్వరలో గంటా అరెస్టవుతారని.. మంత్రి అవంతి శ్రీనివాస్ హెచ్చరించడం ప్రారంభించారు. అయితే.. అన్నింటినీ సర్దుబాటు చేసి.. గంటాను పార్టీలోకి తీసుకోవాలని నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. గంటాపై విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి పోటీ చేసిన కేకే రాజును వైసీపీ హైకమాండ్ పిలిచి మాట్లాడింది. గంటా పార్టీలోకి వచ్చినా రాజకీయ భవిష్యత్‌కు హామీ ఇచ్చినట్లుగా తెలుస్తోంది.