విజయగర్జన పేరుతో తెలంగాణ రాష్ట్ర సమితి ఈ నెల 29న నిర్వహించాలనుకుంటున్న బహిరంగసభకు బాలారిష్టాలు తొలగడం లేదు. ఎక్కడ నిర్వహిచాలన్నా అనుకూలమైన స్థలం దొరకడం లేదు. కనీసం పది లక్షల మందికి సరిపోయే ప్రాంగణం… రావడానికి పోవడానికి అనుకూలమైన రహదారులు, పార్కింగ్ ఇలా మొత్తం అనుకూలంగా ఉన్న స్థలం కోసం టీఆర్ఎస్ నేతలు తిరుగుతూనే ఉన్నారు. వరంగల్ చుట్టుపక్కన పది, పదిహేను కిలోమీటర్ల వరకూ చూస్తున్నారు. కానీ ఎక్కడికి వెళ్లినా ఆయా ప్రాంతాల్లోని రైతుల నుంచి నిరసనలు వ్యక్తమవుతున్నాయి.
పంటలు ఉన్న భూములు.. పంటలు పండుతున్న భూముల్లో సభ నిర్వహిస్తామంటే అంగీకరించే ప్రశ్నే లేదని అంటున్నారు. ఒక్క చోట కాదు ఎక్కడకు వెళ్లినా అదే పరిస్థితి. అసలే పరిస్థితి అంతంతమాత్రంగా ఉన్న సమయంలో ఇప్పుడు రైతుల ఆందోళనలు హైలెట్ అయితే మరింత గడ్డు పరిస్థితి వస్తుందన్న కారణంగా టీఆర్ఎస్ నేతలు కూడా దూకుడుగా వ్యవహరించలేకపోతున్నారు. కొంత మంది చోటా మోటా నేతలు.. సభను నిర్వహించుకునే అవకాశం ఇవ్వకపోతే ధరణి పోర్టల్ నుంచి భూముల వివరాలు తీయించేస్తామన్న బెదిరింపులు చేస్తున్నారు.
ఇది రైతుల్ని మరింత తీవ్ర ఆగ్రహానికి గురి చేస్తోంది. హుజురాబాద్ పరాజయం తర్వాత విజయ గర్జన అనే సభ పెట్టడమే కాస్త తేడాగా ఉంటే ప్రతీ చోటా స్థలం కోసం రైతులతో పోరాటం చేయాల్సి రావడం టీఆర్ఎస్ నేతలకు అంత మంచి శకునంలాగా అనిపించడం లేదు. అసలు ఇప్పుడు విజయగర్జన నిర్వహించాల్సిన అవసరం ఏమిటన్న సందేహం కూడా టీఆర్ఎస్తో పాటు ఇతర రాజకీయ నేతల్లోనూ వస్తోంది. మెల్లగా ఈ అభిప్రాయం టీఆర్ఎస్ పెద్దల్లో కూడా కలిగితే.. తర్వాత ఏప్రిల్కు సభను వాయిదా వేసే అవకాశం ఉంది. ఎందుకంటే టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం ఏప్రిల్ 27న మరి.