ఏపీ సీఎం జగన్ రెడ్డిని గౌతం అదానీ కలిశారు. అహ్మదాబాద్ నుంచి ప్రత్యేక ఫ్లైట్లో విజయవాడ వచ్చిన ఆయన నేరుగా తాడేపల్లి ప్యాలెస్ కు వెళ్లారు. ఇక్కడ ఇరువురి మధ్య చర్చలు జరిగాయి. గౌతం అదానీ ఏపీకి రహస్య పర్యటనలు చేయడం ఇదే మొదటి సారి కాదు. చాలా సార్లు వచ్చారు. ముచ్చట్లు పెట్టి వెళ్లారు.కానీ ఎందుకు వచ్చారు.. ఏం చేశారు.. ప్రభుత్వ పని మీదనా.. వ్యక్తిగత పని మీదనా అన్న విషయాలు సీఎంవో కానీ.. క్యాంప్ ఆఫీస్ వర్గాలు కానీ ఎప్పుడూ ప్రకటించలేదు. ఈ సారి కూడా ప్రకటిస్తారని అనుకోవడం లేదు.
అయితే గన్నవరం ఎయిర్ పోర్టు నుండి ట్రాఫిక్ క్లియరెన్స్ ఇచ్చి మరీ వీఐపీ హోదాలో ఆయనను తాడేపల్లి ప్యాలెస్ కు తీసుకెళ్లడంతో విషయం బయట పడింది. అదానీ గ్రూప్ కు ఏపీలో ఎన్ని ఆస్తులు కట్టబెట్టారో చెప్పాల్సిన పని లేదు. గంగవరం పోర్టు, కృష్ణపట్నం పోర్టు దగ్గర నుంచి విశాఖలో డేటా సెంటర్ పేరుతో కొండల్ని కట్టబెట్టేశారు. నిబంధనలకు విరుద్ధంగా సేల్ డీడ్ కూడా చేసి ఇచ్చారు. అదానీ కోరుకున్నారు.. కృష్ణపట్నం విద్యుత్ ప్లాంట్ కూడా ఇచ్చేయాలనుకున్నారు. చివరికి అదానీ సమస్యల్లో ఇరుక్కోవడంతో వెనక్కి తగ్గారు.
ఇప్పటికే సంప్రదాయేతర విద్యుత్ ఒప్పందాల పేరుతో అదానీకి పెద్ద ఎత్తున భూములు ఇచ్చారు. విద్యుత్ ఒప్పందాలు చేసుకున్నారు. కొత్తగా ఎలాంటి ప్లాన్లు ఏపీలో వేస్తున్నారో తెలియదు. ఎందుకంటే జగన్ రెడ్డి తీసుకునే నిర్ణయాలు ఏవీ ఎవరికీ తెలియదు. రాష్ట్రాన్ని తాకట్టు పెడుతున్నారా.. అమ్ముతున్నారా అన్నదానిపై స్పష్టత ఉండదు. జీవోలు బయటకు రావు. ప్రజలకు ఏమీ తెలియకుండా అన్నీ సాగిపోతూ ఉంటాయి.