ఈ సంక్రాంతికి విడుదలైన గౌతమి పుత్ర శాతకర్ణి… బాక్సాఫీసు దగ్గర అద్భుతమైన విజయాన్ని అందుకొంది. చిరంజీవి ఖైదీ నెం.150 ఒక రోజు ముందే విడుదలై. ఫోకస్ అంతా తనవైపుకు లాక్కున్నా సరే.. శాతకర్ణి నిలబడగలిగింది. దాదాపు గా రూ.70 కోట్ల వసూళ్లతో బాలయ్య కెరీర్లో బిగ్గెస్ట్ హిట్గా నిలిచింది. ఇంత విజయాన్ని అందుకొన్న సినిమా టీవీలో తొలిసారి ప్రసారం అయినప్పుడు రేటింగులు ఎలా ఉండాలి? అదీ.. పండగ పూట. కానీ… అదేం జరగలేదు. ఉగాది రోజున మాటీవీలో ప్రసారమైన ఈ సినిమాకి కేవలం 5.5 రేటింగ్ మాత్రమే వచ్చింది. సినిమా విడుదలైన మూడు నెలల్లోనే టీవీల్లోకి వచ్చినా.. శాతకర్ణికి భారీ రేటింగులు దక్కకపోవడం చిత్రసీమని ఆశ్చర్యపరుస్తోంది.
ఆదివారం ప్రసారమైన శతమానం భవతికి మాత్రం 15.5 రేటింగు దక్కింది. శర్వానంద్ లాంటి మీడియం రేంజు సినిమాకి ఈ స్థాయిలో రేటింగు వచ్చి, బాలయ్య సినిమాకి లేకపోవడం అనూహ్యమైన విషయమే. అయితే.. మాటీవీ చేసిన మరో పొరపాటు ఏంటంటే.. ఉగాది రోజునే మాటీవీలో ఒకసారి, మా మూవీస్లో మరోసారి శాతకర్ణి సినిమాని టెలీకాస్ట్ చేయడం. దాంతో.. వ్యూవర్స్ విడిపోయారని విశ్లేషకులు చెబుతున్నారు. పైగా బుధవారం టెలీకాస్ట్ చేయడం వల్ల రావల్సినంత రేటింగులు రాలేదని, వారాంతంలో శాతకర్ణిని ప్రదర్శిస్తే.. మెరుగైన రేటింగు వచ్చేదని చెబుతున్నారు.