విధులు.. నిధులు.. కనీసం ఆఫీసులు కూడా లేని కార్పొరేషన్లు ఏర్పాటు చేసి పదవులు ఇచ్చేసి.. బీసీలకు సంక్రాంతి పండగ చేసేసిన సీఎం జగన్మోహన్ రెడ్డి… అత్యంత కీలకమైన నామినేటెడ్ పదవుల్లో మాత్రం ఒక్క వర్గానికే చాన్సిస్తున్నారు. తాజాగా.. ఏపీ ఫైబర్ నెట్ కార్పొరేషన్ చైర్మన్‌గా పున్నూరు గౌతంరెడ్డిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అమ్మఒడి ప్రారంభోత్సవంలో విద్యార్థులకు ల్యాప్ ట్యాప్‌లు ఇస్తామని.. రాష్ట్రం మొత్తం గ్రామాలతో సహా అండర్ గ్రౌండ్ కేబుల్స్ వేసి ఇంటర్నెట్ ఇస్తామని ప్రకటించారు. ఇదంతా ఏపీ పైబర్ నెట్ ద్వారానే చేయాలి. ఇందు కోసం పెద్ద మొత్తంలో ఖర్చు పెట్టాల్సి ఉంది. గత ప్రభుత్వంలో పోల్స్ మీద కేబుళ్ల ద్వారా ఫైబర్ నెట్ ప్రాజెక్టును చేపట్టారు. అందులో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని.. లోకేష్ అవినీతి చేశాడని ఆరోపణలు గుప్పించారు.
అవి ఇప్పటికీ ఆరోపణలుగానే ఉండిపోయాయి. ఇప్పుడు ఆ ఫైబర్ నెట్ కార్పొరేషన్‌కు చైర్మన్‌గా పున్నూరు గౌతంరెడ్డిని నియమించారు. ఈయనకు సామాజికవర్గ బలం మాత్రమే కాదు.. బంధువు బ్యాక్ గ్రౌండ్ కూడా ఉంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుటుంబానికి ఈయన సమీప బంధువు. అవినాష్ రెడ్డి లాంటి వాళ్లు తరచూ ఆయన ఇంటికి వస్తూ ఉంటారు. 2014 ఎన్నికల్లో విజయవాడ సెంట్రల్ నుంచి పోటీ చేశారు. కానీ పరాజయం పాలయ్యారు. 2019 ఎన్నికల్లో టిక్కెట్ దక్కలేదు. అయితే వైసీపీలో ఆయన ట్రేడ్ యూనియన్ నాయకుడు. వైఎస్ఆర్ టీయూసీ అనే అనుబంధ సంఘానికి అధ్యక్షుడు. తాను.. కార్మిక నాయకుడినని చెప్పుకుంటారు. అలాంటి వ్యక్తికి.. దానికి సంబంధించి పదవి ఏదైనా ఇస్తారు కానీ.. టెక్నికల్‌గా హై స్టాండర్డ్స్ ఉండాల్సిన పదవికి ఎంపిక చేశారు. అందతూ బంధుత్వం.. సామాజిక వర్గ పవరేనని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
ఈ గౌతం రెడ్డి మామూలు వ్యక్తి కాదు. కాపుల్ని రెచ్చగొచ్చడానికి టీడీపీ హయాంలో.. వంగవీటి రంగాను పాముతో పోల్చాడు. ఓ టీవీ చానల్ ఇంటర్యూలో పని గట్టుకుని మరీ.. వంగవీటి రంగా హత్యను ప్రస్తావించి… పామును చంపితే తప్పేమిటని ప్రశ్నించారు. ఈయన వ్యాఖ్యలపై అప్పట్లో పెద్ద దుమారం రేగింది. అప్పట్లో వైసీపీలోనే ఉన్న వంగవీటి రాధా నిరసన వ్యక్తం చేస్తే.. పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లుగా కొంత కాలం షో నడిపారు. తర్వాత పార్టీలోకి ఎప్పుడు తీసుకున్నారో తెలియదు కానీ.. ఆయన హవానే ఎక్కువగా ఉంటుంది. చివరికి ఇప్పుడు పదవే కట్టబెట్టేశారు. మొత్తానికి కాపుల ఆరాధ్య దేవాన్ని పాముగా ప్రస్తావించి… ఆయనను చంపినా తప్పు లేదన్న అభిప్రాయంతో ఉన్న బంధువుకు జగన్ కీలకమైన పదవే కట్టబెట్టారు.